హైదరాబాద్: అంతా ఊహించినట్లుగానే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో టీఆర్‌ఎస్ నేతలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నేతలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఎంపీ విశ్వేశర్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. చాలా సేపు రాజకీయాలపై చర్చించారు. అనంతరం తాను ఈనెల 23న కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. 

అందులో భాగంగా సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాను కాంగ్రెస్ లోకి రావడం సొంతింటికి వచ్చినట్లు ఉందని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. విశ్వేశ్వర్ రెడ్డితోపాటు టీఆర్ఎస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ యాదవరెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టీఆర్ఎస్ పార్టీ యాదవరెడ్డిని బహిష్కరించింది. ఈనేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

ఇకపోతే టీఆర్ఎస్ కు భారీ షాక్ తగలబోతుందని ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని దమ్ముంటే వాళ్లను ఆపుకోండని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగల్ బహిరంగ సభలో స్పష్టం చేశారు. రేవంత్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే టీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. 

ఆ పార్టీకి చెందిన చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డిలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరే కాదు మరికొద్ది రోజుల్లో మరింత మంది టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్తున్నారు. మరి ఈ వలసలు ఇంకా ఉంటాయో లేక కేసీఆర్ బుజ్జగించుకుంటారో వేచి చూడాలి.