హైదరాబాద్‌: ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అభ్యర్థులు చిత్రవిచిత్రమైన పనులు చేస్తున్నారు. ఓటర్ల మద్దతు కోసం ఏ అవకాశాన్ని కూడా వారు వదులుకోవడం లేదు. ప్రజా కూటమి తన అభ్యర్థులను ఇప్పటికీ ప్రకటించలేదు. టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. 

రద్దయిన అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి భూపాలపల్లి నియోజకవర్గంలోని ఓ మంగలి షాపులో గడ్డం చేస్తూ కనిపించారు. మరో అభ్యర్థి చింతా ప్రభాకర్ సంగారెడ్డిలోని ఓ ఇంటిలో వంట చేశారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆయన ఆ పనిచేశారు. 

మహబూబ్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ కుట్టు మిషన్ పై బట్టలు కుట్టారు. కూలీలతో కలిసి భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. బోధన్ అభ్యర్థి షకీల్ అహ్మద్ ఓటర్లకు అన్నం తినిపించారు. 

ఇల్లెందు అభ్యర్థి కోరం కనకయ్య ఓ ఓటరుకు స్నానం చేయించారు. మగ్గుతో అతని తలపై నీళ్లు పోస్తూ ఆయన దర్శనమిచ్చారు. తెలంగాణ శాసనసభలోని 119 సీట్లకు డిసెంబర్ 7వ తేదీన పోలీంగ్ జరుగుతుండగా ఓట్ల లెక్కింపు 11వ తేదీన జరుగుతుంది.