కరీంనగర్: ఎస్సీ కార్పోరేషన్ మాజీ ఛైర్మెన్ పిడమర్తి రవి  అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించి విరాళాల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

కరీంనగర్ లో రాజ్యాంగ రక్షణ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్నటి నుండి చందాల దందా మొదలైందన్నారు. అయోధ్యలో రాముడికి చందాలు ఇవ్వాలంటూ బీజేపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

రానున్న రోజుల్లో జై భీమ్- జై శ్రీరాం అనే నినాదాల మధ్య దేశంలో యుద్ధం జరగనుందని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు అయోధ్య రాముడు ఎక్కడ పుట్టాడో తెలవదన్నారు.రాముడు తమ దగ్గరే జన్మించాడని నేపాల్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. రాముడు భారత్ లో పుట్టాడా.. నేపాల్ లో పుట్టాడా ..జర్మనీలో పుట్టాడో తేలాల్సి ఉందన్నారు. 

ప్రజా సమస్యలపై స్పందించకుండా నిత్యం గుళ్లు, గోపురాలు అంటూ ఎంపీ బండి సంజయ్  తిరుగుతూ టీఆర్ఎస్ పై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు.దళితులు హిందూవులైతే ఆలయాల్లోకి ఎందుకు ప్రవేశించకుండా అడ్డుకొంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఇదే వేదికపై ఉన్న బీజేపీ నేత అజయ్ వర్మ పిడమర్తి రవి ప్రసంగానికి అడ్డు తగిలారు.

బండి సంజయ్ పై ఎందుకు విమర్శలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది రాజకీయ వేదిక కాదని ఆయన హితవు పలికారు. ఇదే సమయంలో వేదికపై ఉన్న ఇతరులు కూడ ఇద్దరికి సర్ధి చెప్పారు.