హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మాజీ ఎమ్మెల్యే కనకా రెడ్డి ఆకస్మికంగా మరణించారు. ఆయన 2014 నుంచి 2018 వరకు మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

కొద్దిరోజులుగా హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో కనకా రెడ్డి చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న కనకారెడ్డి అభిమానులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.

మల్కాజ్ గిరి నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యుడు సి. కనకారెడ్డి మృతి పట్ల మంత్రి ఈటల రాజేందర్ వ్యక్తం చేశారు. కిమ్స్ లో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

ఇటీవలి ఎన్నికల్లో మల్కాజిగిరి సీటును మల్లారెడ్డికి కేటాయించారు. ఆ సీటు నుంచి శాసనసభకు ఎన్నికైన మల్లారెడ్డిని మంత్రి పదవి కూడా వరించింది. కనకారెడ్డి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లనే అభ్యర్థిని మార్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 

కనకారెడ్డి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సి. కనకారెడ్డి అకాల మరణ వార్త విన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావుతో కలసి రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కార్మిక, ఉపాధి కల్పనల శాఖ మంత్రి  సిహెచ్ మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్ మోహన్ ఆసుపత్రికి వెళ్లి  కనకారెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.