చెన్నూరు: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మందమర్రిలో ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీయేతర ఫెడరల్‌ ఫ్రంట్‌ కొలువు దీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఆ ఫ్రంట్ లో తానే కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ సీఎంతో పాటు అక్కడ కేంద్రంలోనూ కీలక పాత్ర పోషిస్తానన్నారు. తమంతటి వారు లేరని కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ నేతలు చెబుతున్నారని అలాంటి వాళ్లు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.  

58ఏళ్లు పాలించిన కాంగ్రెస్,టీడీపీలు ఎందుకు 24గంటల కరెంటు ఇవ్వలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. గప్పాలు కొడితే నాణ్యమైన కరెంటు రాదన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని వాటిని అధిగమించేందుకు మానవీయ కోణంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 

మోదీ, అమిత్‌షాలు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉన్న 19 రాష్ట్రాల్లో వృద్ధులకు రూ. వెయ్యి పింఛను ఇస్తున్నారా? కంటి వెలుగు కార్యక్రమం భారత్‌లో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం కూడా అమలు చెయ్యలేని పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు సంపూర్ణ ఆరోగ్య తెలంగాణయే తన లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమానికి తానే శ్రీకారం చుట్టానని తెలిపారు. తన నియోజవకర్గంలో ఒక గ్రామం నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే కంటి వెలుగు అన్నారు. 

త్వరలో ఈఎన్‌టీ వైద్య బృందం కూడా గ్రామాల్లో పర్యటించి ఆయా సమస్యలతో బాధపడే వారికి మందులు అందిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్కరి బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరించి వివరాలు ఒక చోట పొందు పరుస్తామని అత్యవసర సమయంలో వేగంగా చికిత్స అందించడానికి ఆ వివరాలు ఉపయోగపడతాయని చెప్పుకొచ్చారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల తీర్పు కోసమే ఎన్నికలకు వచ్చామన్నారు. ఆసరా పింఛన్లు, కేసీఆర్‌ కిట్లు, కల్యాణలక్ష్మి, అమ్మఒడి వాహనాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. 

ఒక అద్భుతమైన తెలంగాణ కావాలన్నది నా కల అని కేసీఆర్ స్పష్టం చేశారు. బాల్క సుమన్‌పై ఎన్నో కేసులు పెట్టారని అలాగే తెలంగాణ పోరాటంలో నాపైనే 3670 కేసులు పెట్టారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఆంధ్రాలో కూడా నాపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. అవిపోగా ఇంకా తనపై 60 కేసులు ఉన్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు. సుమన్‌ గెలిస్తే సాధారణ ఎమ్మెల్యేగా ఉండడని ఉన్నత స్థానంలో ఉంటాడని చెప్పుకొచ్చారు. దయ చేసి నా కుమారుడు లాంటి సుమన్‌ గెలిపించండని ప్రజలకు పిలుపునిచ్చారు.