ములుగు: 2019 జనవరి 20 తర్వాత ములుగును గిరిజన ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తానని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ములుగు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ 2001లో పంచాయితీరాజ్ ఎన్నికల ఉద్యమం ములుగు నుంచే ప్రారంభమైందని గుర్తు చేశారు. 

తెలంగాణ ఉద్యమంలో ములుగు నియోజకవర్గ ప్రజలు అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. ఒకవైపు 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ కూటమి అభ్యర్థి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరోవైపు ఉన్నారు. 

ఎవరికి ఓటు వెయ్యాలో నిర్ణయించుకోవాల్సింది మీరేనన్నారు. 58 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలన ఎలా ఉందో నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలన ఎలా ఉందో మీరే బేరీజు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పార్టీలు కాదు గెలవాల్సింది ప్రజలు అని కేసీఆర్ పిలుపునిచ్చారు.  

తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలా పనిచేస్తున్నాను కాబట్టే ఇంత అభివృద్ధి జరగుతుందన్నారు. తెలంగాణలో 24 గంటలు విద్యుత్ వస్తుందంటే అందుకు మేము కాపలా కాయడం వల్లేనని చెప్పుకొచ్చారు. కళ్యాణ లక్ష్మీ పథకం నా మదిలో పుట్టడానికి కారణం ములుగు నియోజకవర్గమేనని తెలిపారు. 

 భాగ్య తాండాలోనే కళ్యాణ లక్ష్మీ పథకం పుట్టిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తాను ములుగు పర్యటన వచ్చినప్పుడు భాగ్య తాండా అగ్నికి ఆహుతి అయ్యిందని తాను వచ్చి వారిని పరామర్శించినట్లు తెలిపారు. ఆ సమయంలో ఓ గిరిజనుడు చచ్చిపోతానని ఏడుస్తున్నాడని అది విని తాను వెళ్లి అడిగానని అయితే కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న రూ.50వేలు అగ్నికి ఆహుతైపోయాయని ఇక పెళ్లి ఎలా అంటూ మెుత్తుకున్నాడని తెలిపారు. 

ఆ రోజు ఒక పేదవాడు పెళ్లి చేయ్యాలంటే ఎంత కష్టమో ఆనాడే తెలుసుకున్నానని అందుకే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కళ్యాణ లక్ష్మీ పథకం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పచ్చి అబద్దాలు చెప్పారన్నారు. మోదీ నిజామాబాద్ వచ్చి కరెంట్ లేదు అని కిరికిరి మాటలు మాట్లాడారని విమర్శించారు. కరెంట్ లేదు అంటున్నావ్ కదా వస్తున్నా అరగంట వెయిట్ చెయ్ అంటే మోదీ ఉండలేదని దాటి పోయాడని తెలిపారు.

రామప్ప చెరువును దేవాదుల తో నింపుతానని హామీ ఇచ్చారు. లక్నవరం, ఘనపురం చెరువులకు లిఫ్ట్ ద్వారా నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే జూన్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తవుతుందని తెలిపారు. 

జనవరి నెలలోనే ములుగును ప్రత్యేకమైన గిరిజన జిల్లాగా ఏర్పాటు చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే మల్లంపల్లిని మండలం చేస్తామన్నారు. జనవరి 20 తర్వాత తానే స్వయంగా వచ్చి ములుగు గిరిజన జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తానన్నారు. అయితే చందూలాల్ ని లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు.