పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ విజయం సాధించడం ఖాయమని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 100 సీట్లతో అధికారంలోకి వస్తున్నామంటూ జోస్యం చెప్పారు. 

పెద్దపల్లి జిల్లాలోని మంథని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ మంథనిలో పుట్టా మధు 50 వేల మెజారిటీతో గెలవబోతున్నాడని గులాబీ బాస్ జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మరిన్ని ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 

టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి, ఈ బక్కోడిని కొట్టేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యాయని ఆరోపించారు. మహాకూటమి కాదని అది మాయా కూటమి అంటూ విమర్శించారు. 58ఏళ్ళ కాంగ్రెస్, టీడీపీ పాలన ఒకవైపు, 15 ఏళ్లు పోరాటం చేసి నాలుగున్నరేళ్లు అద్భుత పాలన అందించిన టీఆర్ఎస్ మరో వైపు ఉందని గుర్తు చేశారు.
 
మరోవైపు ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీయేతర ఆధిపత్యం పోవాలని తెలిపారు. రాష్ట్రాలపై ఢిల్లీ కర్రపెత్తనం పోవాలంటే మనమే ఢిల్లీలో చక్రం తిప్పాలని కోరారు. తెలంగాణలో 17 ఎంపీలను గెలిపిస్తే ఫెడరల్ ఫ్రంట్ చక్రం తిప్పుతామన్నారు. 

ఇకపోతే ప్రధాని నరేంద్రమోదీ కరెంట్ విషయంలో అబద్దాలు ఆడటం దిగజారుడుతనానికి నిదర్శనమని కేసీఆర్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా మీటింగ్ లో కరెంట్ ఇవ్వడం లేదంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. అరగంట వెయిట్ చెయ్యమంటే వెయిట్ చెయ్యకుండా దాటి పోయాడంటూ విమర్శించారు. 

మోదీ ఉంటే కరెంట్ ఉంటుందో లేదో అక్కడే చూపించేవాడినని తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ర్టంలో రైతుబంధు, కళ్యాణ లక్షి, రైతులకు 24గంటల కరెంటు, పెన్షన్‌ల పెంపు, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే టీఆర్ఎస్‌ను ప్రజలు మళ్లీ ‌పట్టం కట్టాల్సిదేనన్నారు. 
 
కాంగ్రెస్ పార్టీ కిరికిరి మాటలను నమ్మెుద్దు అని వాళ్లకు మెుదడు తక్కువ పంచాయితీ ఎక్కువ అని కేసీఆర్ ఘాటుగా విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ఏర్పడింది అంటే అది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లేనన్నారు. 

తెలంగాణ రాష్ట్రం రాకపోతే, మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే కాకపోతే, కేసీఆర్ సీఎం కాకపోతే పెద్దపల్లి జిల్లా ఏర్పడుతుందా అంటూ నిలదీశారు. మీ చిరకాల వాంఛ నెరవేర్చానని  అయితే మనోహర్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించి కృతజ్ఞత తీర్చుకోవాలని కోరారు.