ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్ మహానగరాన్ని తానే నిర్మించానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు హైదరాబాద్ నిర్మిస్తే మరి ముహమ్మద్ కులీ కుతుబ్ షా ఏమై పోవాలన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు నియోజకవర్గంలో ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా బతికి ఉంటే చంద్రబాబు మాటలు విని ఆత్మహత్య చేసుకునేవాడన్నారు. 

ఇలా ఉంటే చార్మినార్ ను కూడా తానే నిర్మించానని చంద్రబాబు చెప్పుకుంటాడని ధ్వజమెత్తారు. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలబెట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల కాలంలో ఎందుకు కరెంట్ ఇవ్వలేదని విమర్శించారు. 

కరెంట్ ఇవ్వాలని అడిగితే తెలంగాణ ప్రజలను బషీర్ బాగ్ వద్ద కాల్చి చంపావని కేసీఆర్ ఘాటుగా విమర్శించారు. తెలంగాణ బిడ్డల బుల్లెట్ తూటాలకు బలవ్వడంతోనే ఆంధ్రోళ్ల పాలనలో బతకలేమన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్ జెండా ఎగురవేశామన్నారు. బషీర్ బాగ్ కాల్పులు చూసే టీఆర్ఎస్ జెండాతో పోరాటం చేశానని చెప్పారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఏనాడైనా కంటి వెలుగు పథకం ఊహించారా అని ప్రశ్నించారు. పేదవాళ్లు ఒక అమ్మాయి ఉంటే ఆమె పెళ్లి బరువు అనుకునే వారని అలాంటిది తాము వారిని ఆదుకున్నామన్నారు. ఆడపిల్ల పెళ్లికి లక్షా 116 రూపాయలు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. 

ఆలేరు టీఆర్ఎస్ అభ్యర్థి సునీత తన బిడ్డ అంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. తాను తెలంగాణ ఉద్యమ పోరాట సమయంలో సునీత నా వెన్నంటే నిలిచిందన్నారు. ఓడినా గెలిచినా కేసీఆర్ ను వీడలేదన్నారు. ఇలాంటి గట్టివారు ఉన్నారు కాబట్టే కేసీఆర్ అన్నీ విజయం సాధించారని చెప్పుకొచ్చారు. 

మరోవైపు కల్లు గీత కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. ఆనాడు ఆంధ్రా పాలకులు చీఫ్ లిక్కర్ కాసులకు కక్కుర్తిపడి కల్లు దుకాణాలు మూసివేశారని గుర్తు చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో కల్లు దుకాణాలను కల్లు దుకాణాలు బంద్ చేస్తే తాను ముఖ్యమంత్రి అయ్యాక కల్లు దుకాణాలను తెరిపించామన్నారు.గీత కార్మికుల పన్నును కూడా తొలగించినట్లు తెలిపారు. 

మరోవైపు గుండాల ప్రజలు జనగామ జిల్లాలో ఉండమంటున్నారని వారి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నెలరోజుల్లోనే యాదాద్రి జిల్లాలో కలిపేస్తామన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. 

ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే తాము ఇక్కడే తీసుకుంటామని ఢిల్లీలోనో, విజయవాడలోనో తీసుకోమని చెప్పుకొచ్చారు. తాము ఎవరికి గులాం కాదని, ఎవరికి బానిసలం కాదని తాము ప్రజలకు మాత్రమే బానిసలమన్నారు. 

మరోవైపు ప్రజలు అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని కన్ఫ్యూజన్ కావొద్దన్నారు. ఒ పార్టీ గెలవాలనో, అభ్యర్థి గెలవాలనో కాదని ప్రజాస్వామ్యం గెలవాలని కోరుకోవాలని తాను ఆశిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. 

సునీతను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు. సునీత ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక్క ఎమ్మెల్యేగానే ఉండదని ఆమె హోదా పెరుగుతుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఆమె హోదా పెరిగితే నియోజకవర్గం హోదా కూడా పెరుగుతుందన్నారు.