Telangana : ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ తీరుకు వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ శ్రేణుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో  ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దిష్టిబొమ్మ‌ల‌ను ద‌హ‌నం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు.. ప్ర‌తిగింజ కొనుగోలు చేసే వ‌ర‌కు ఉద్య‌మం కొన‌సాగిస్తామ‌ని చెబుతున్నారు.  

Telangana : యాసంగి సీజన్‌లో పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయరాదన్న కేంద్రం నిర్ణయంపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి, జెండాలు చేతబూని ప్రధాని నరేంద్రమోడీ కి వ్య‌తిరేకంగా నిన‌దించారు. కేంద్ర బీజేపీ స‌ర్కారు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ఆందోళ‌న‌లు ఉధృతంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గీసుగొండ టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రైతులతోపాటు టీఆర్‌ఎస్‌ సభ్యులు నల్లబ్యాడ్జీలు, జెండాలు ధరించి నిరసన తెలిపారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ లో అనేక చోట్ల నిర‌స‌న‌లు కొన‌సాగాయి. 

యాసంగి సీజన్‌లో పండించిన వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని చెన్నారం గ్రామంలో, జనగాం జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండల కేంద్రంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను ద‌హ‌నం చేశారు. మోడీ దిష్టి బొమ్మ‌తో 'అంత్యక్రియ యాత్ర' నిర్వహించారు. ఈ క్ర‌మంలోనే మోడీ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ స‌ర్కారు తీరును ఖండించారు. 

అలాగే, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పార్టీ శ్రేణులు తమ నివాసాల వద్ద నల్లజెండాలు ప్రదర్శించారు. యాసంగి వరి కొనుగోలులో కేంద్రం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆదేశాలను పాటించాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం, కొత్తగూడెం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూధన్‌, కె.కాంతారావు, స్థానిక ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులల‌ను కోరారు. మంత్రి అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఖమ్మం వీధుల్లో భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరించడాన్ని నిరసిస్తూ భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను ఖండించారు. రాష్ట్రంలో పండే మొత్తం ధాన్యం సేక‌రించాల‌ని డిమాండ్ చేశారు. 

అంత‌కు ముందు.. తెలంగాణ నుంచి వరి ధాన్యం కొనుగోలు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ప్రతి వరి గింజను కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చేంత వరకు తమ నిరసనను కొనసాగిస్తామని టీఆర్‌ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రబీ సీజన్‌లో రాష్ట్రం నుంచి పూర్తి స్థాయిలో వరిధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర శాసనసభ్యులు జిల్లా కేంద్రంలో నిరసనలకు నాయకత్వం వహించారు.

మొత్తం 33 జిల్లాల్లో జరిగిన నిరసనల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో పార్టీ జెండాలు, వరి మొక్కలు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్ర‌ధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. ప్రతి వరి గింజను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చేంత వరకు నిరసనలు కొనసాగిస్తామని టీఆర్‌ఎస్ నేతలు పున‌రుద్ఘాటించారు. సిరిసిల్లలో జరిగిన నిరసన కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పరిశ్రమలు, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖల మంత్రి కేటీఆర్‌, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు.