తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులను కేసీఆర్ తీవ్రంగా మోసం చేశారన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ప్రజలు తిరస్కరిస్తున్నా కేసీఆర్ అలాగే ముందుకెళుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు.

హైదరాబాద్‌లో ఏర్పడిన జర్నలిస్టు కాలనీలన్నీ కాంగ్రెస్ హయాంలోనే ఏర్పడ్డాయన్నారు..అధికారంలోకి వచ్చాకా ప్రజాకూటమి జర్నలిస్టులకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. మీడియా ప్రతినిధులుకు డబుల్, ట్రిబుల్ బెడ్‌రూమ్‌లు కట్టిస్తానన్న ముఖ్యమంత్రి అన్ని రకాలుగా మోసం చేశారని ఉత్తమ్ మండిపడ్డారు.

సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని కేసీఆరే ఒప్పుకున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో నష్టపోతామని తెలిసినా.. విద్యార్థుల ఆత్మబలిదానాలను ఆపాలని సోనియా గాంధీ నిర్ణయానికే ప్రతిఫలమే తెలంగాణ అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఐఎం నేడు టీఆర్ఎస్‌కు మిత్రపక్షమని టీపీసీసీ చీఫ్ ఎద్దేవా చేశారు.

అత్యధిక ఆదాయం ఉన్న హైదరాబాద్‌ను తెలంగాణలో కలపడం వెనుక సోనియా గాంధీ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నారని ఉత్తమ్ కుమార్ చెప్పారు. తెలంగాణకు దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పారని ఆయన విమర్శించారు.

ఎన్నికల్లో కేసీఆర్‌ను 65 శాతం మంది ప్రజలు సీఎంగా తిరస్కరించారని ఉత్తమ్ తెలిపారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కేసీఆర్ అడ్డగొలుగా కొనుగోలు చేశారని ఉత్తమ్ అన్నారు. మీడియాను బెదిరించారు.. మాట వినని ఛానెళ్లను సీఎం నిషేధించారని ఆయన గుర్తు చేశారు. ఒక టీవీ ఛానెల్‌లను పది కిలోమీటర్ల మేర పాతరేస్తానని కేసీఆర్ వరంగల్ సభలో చెప్పారన్నారు.

మీడియా మొత్తం ఒక పార్టీనే కవర్ చేస్తోంది.. దీని వెనుక ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌లకు తెలంగాణ ప్రజల పట్ల ఎలాంటి ప్రేమ లేదని దాని వెనుక ధనదాహం, అధికారదాహం మాత్రమే ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఆరోపించారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారని ఉత్తమ్ తెలిపారు. దాచుకున్న సొమ్ము ఎత్తుకుపోతారని నరేంద్రమోడీ అంటే కేసీఆర్‌కు భయమన్నారు. చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, ఖాజీపేట డివిజన్ గురించి కేసీఆర్ ప్రధానిని ఎందుకు అడగలేదని ఉత్తమ్ ప్రశ్నించారు.

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయల్లో కేసీఆర్, కేటీఆర్ 6 శాతం కమిషన్ తీసుకున్నారని ... దొంగ పాస్‌పోర్టులు, వీసాలు అమ్ముకున్నప్పుడు నేను ఇండియా-చైనా బోర్డర్‌లో ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సైనికుడినన్నారు. ఢిల్లీలో అరెస్ట్ అయితే ఎం.సత్యనారాయణరావు కేసీఆర్‌ను విడిపించారని ఉత్తమ్ గుర్తు చేశారు.

నిమ్స్‌లో దీక్ష చేసినప్పుడు కేసీఆర్ ఇంజెక్షన్లు తీసుకున్నారని తాను డాక్యుమెంట్లు రిలీజ్ చేసినట్లు ఉత్తమ్ కుమార్ గుర్తుచేశారు. తనపై, తన భార్యపై కేసీఆర్, కేటీఆర్‌లు అసభ్యపదజాలంతో ఆరోపణలు చేస్తున్నారని.. తమకు పిల్లలు లేరని.. తెలంగాణ సమాజమే తమ కుటుంబమని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళతారు.. కేటీఆర్ అమెరికా పెట్టేబేడా సర్దేస్తారని ఉత్తమ్ అన్నారు.