రాజయ్యను బర్తరఫ్ చేసినట్లే కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  రేపటి నుంచి కొద్దిరోజుల పాటు కేటీఆర్ అవినీతి, విధ్వంసం గురించి చెబుతున్న కార్యక్రమానికి బ్రేక్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. 

వారసత్వ సంపదగా ప్రకటించిన కేబీఆర్ పార్క్ చుట్టూ మంత్రి కేటీఆర్ విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 2006లో అప్పటి వైఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ కట్టి పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించిందన్నారు. అయితే దీనిని ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించి.. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిబంధనలు పాటించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధన పెట్టిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. సత్యం రామలింగరాజుకు చెందిన మెటాస్ సంస్థతో పాటు మరో మూడు సంస్థలు కన్సార్షియంగా ఏర్పడి నిర్మాణ అనుమతులు దక్కించుకున్నాయని తెలిపారు. అయితే సత్యం కుంభకోణం కారణంగా మెటాస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందన్నారు. 

అయితే ఈ ప్రాజెక్ట్‌లోకి మంత్రి డెవలపర్స్‌ వచ్చి చేరిందని, అంతేకాకుండా 80 శాతం మంత్రి డెవలపర్స్ కొనుగోలు చేసిందన్నారు. తొలుత గ్రౌండ్ ప్లస్ టూ నిర్మాణాలకే అనుమతి వుండగా.. మంత్రి సంస్థ జీ ప్లస్ 7కి దరఖాస్తు చేసిందని రేవంత్ తెలిపారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేటీఆర్ కన్ను ఈ ప్రాజెక్ట్‌పై పడిందని ఆయన ఆరోపించారు. అలా 2018, 2021లలో అదనపు ఫ్లోర్‌ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకుందని రేవంత్ చెప్పారు. 

ALso Read: కేసీఆర్ కుటుంబ స్వార్థానికి హైదరాబాద్ బలైపోయింది: రేవంత్ రెడ్డి

అయితే కేసుల్లో ఇరుక్కున్న రాజులు మరోసారి రంగ ప్రవేశం చేశారని.. ఈ క్రమంలో సత్యం రామలింగరాజుకు అత్యంత నమ్మకస్తుడైన వీర వెంకట రామారావు ‘‘ఆర్ అండ్ ఆర్’’ పేరిట సంస్థను ఏర్పాటు చేశారని రేవంత్ చెప్పారు. ఈ సంస్థ మంత్రితో కలిసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో పాల్గొందని ఆయన తెలిపారు. మొత్తం 200 ప్లాట్లు ఇక్కడ నిర్మిస్తున్నారని.. ఒక్కో ప్లాట్ ధర రూ.21 కోట్లు వుంటుందని రేవంత్ చెప్పారు. మొత్తంగా ఇది రూ.4000 కోట్ల ప్రాజెక్ట్ అని తెలిపారు. శ్రీమంతులు మాత్రమే ఇక్కడ ఫ్లాట్ కొనుగోలు చేయగలరని.. ఒక్కో ఇంటికి 5 కార్లు, 5 ఏసీలు పెడితే కేబీఆర్ పార్క్ పరిస్ధితి ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

పర్యావరణ చట్టాల ప్రకారం ఇక్కడ 100 నుంచి 150 అడుగుల వరకు ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదని తెలిపారు. అలాంటి చోట 15 అంతస్తులకు అనుమతులు ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. సంస్థలను క్రియేట్ చేసి దోచిపెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడితే కొడుకైనా, కూతురైనా వదిలిపెట్టేది లేదని గతంలో కేసీఆర్ ప్రకటించారని.. మరి ఇంతటి విధ్వంసానికి, అవినీతికి పాల్పడుతోన్న కేటీఆర్‌ను అడ్డుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో రాబరీ జరుగుతోందని.. దోపిడి, విధ్వంసాన్ని అడ్డుకోరా అని ఆయన ప్రశ్నించారు. 

ఒకప్పుడు హైదరాబాద్‌కు నివాసయోగ్యంగా వుండే నగరంగా గుర్తింపు వుండేదని.. కానీ ఇప్పుడు మొత్తం పోతోందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మూసీ నది నీళ్లు తాగి బతికేవారని.. ఇప్పుడు మూసీ మురికి కూపంలా మారిందని, ఆ నీటిని తాగినా, వ్యవసాయం చేసినా క్యాన్సర్ వస్తుందని రేవంత్ తెలిపారు. కేబీఆర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్‌ ఈ విషయమై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాలని ఆయన కోరారు. కేబీఆర్ పార్క్‌లో చిన్న పువ్వు తెంపినా శిక్ష వేస్తారని.. గతంలో ఎలివేటెడ్ కారిడార్‌ ప్రతిపాదన వచ్చినా ప్రభుత్వం అనుమతివ్వలేదని రేవంత్ గుర్తుచేశారు. 

ALso Read: తెలంగాణలో భూ దందా వెనుక తండ్రీకొడుకులు, ఏడుగురు ఐఏఎస్‌లు .. ఈ డీ-9 గ్యాంగ్‌ని వదిలేది లేదు :రేవంత్ రెడ్డి

ఐదంతస్తులు భూమీ కింద పెట్టి నిర్మాణాలు చేస్తున్నారని.. ఏమైనా అనుకోని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ విధ్వంసం గురించి చెబుతున్న తనను ఇంటి నుంచి బయటకు రానియ్యకుండా పోలీసులతో కాపలా పెట్టారని రేవంత్ మండిపడ్డారు. కేటీఆర్ కంటే అధ్వాన్నమైన జీవితం ఎవరికీ లేదని.. రాజులను సంతోషపెట్టేందుకు ఇలా చేయాలా అని ఆయన ప్రశ్నించారు. పార్టీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలనే కాకుండా చివరికి మాజీ వార్డ్ మెంబర్లను కూడా కొనుగోలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. 

రాజయ్యను బర్తరఫ్ చేసినట్లే కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేపటి నుంచి కొద్దిరోజుల పాటు కేటీఆర్ అవినీతి, విధ్వంసం గురించి చెబుతున్న కార్యక్రమానికి బ్రేక్ ఇస్తున్నట్లు రేవంత్ చెప్పారు. ఎపిసోడ్ 1కు బ్రేక్ ఇస్తానని.. ఎపిసోడ్‌ 2లో అసలు బొమ్మ వుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వీరిని శిక్షిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో కొనేరు రంగారావు మున్సిపల్ శాఖ మంత్రిగా వున్నప్పుడు చిన్న ఆరోపణ వచ్చిందని.. దీంతో ఆయన రాజీనామా చేసి విచారణకు ఎదుర్కొన్నాకే తిరిగి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని ఆయన తెలిపారు. ఆ లెక్కనే కేటీఆర్ కూడా చేయాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.