తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుపై కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విద్యుత్ సౌధ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణలో విద్యుత్ ఛార్జీల (electricity charges ) పెంపుపై కాంగ్రెస్ (congress) ఆధ్వర్యంలో గురువారం విద్యుత్ సౌధను (vidyut soudha) ముట్టడించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) మాట్లాడుతూ.. కేసీఆర్ (kcr) , ప్రధాని మోడీలు (narendra modi) లక్షల కోట్లు దోపిడి చేశారని ఆరోపించారు. పేదల రక్తాన్ని వీళ్లు పీల్చి పిప్పి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనిని వ్యతిరేకిస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు రేవంత్ తెలిపారు. ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే రాష్ట్రంలో డిస్కంలు దివాళా తీశాయని ఆయన ఎద్దేవా చేశారు. ఉత్పత్తి సామర్ధ్యాన్ని తగ్గించడం వల్లే జెన్‌కో, ట్రాన్స్‌కో దివాళా తీశాయని రేవంత్ మండిపడ్డారు. 

ఎన్నిసార్లు వాస్తవాలను వారి దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదన్నారు. అధికారుల మీద కూడా కేసీఆర్ ప్రభుత్వం నిఘా పెట్టిందని రేవంత్ ఆరోపించారు. ఇప్పుడు తమ చేతుల్లో వున్న ఏకైక మార్గం న్యాయస్థానం తలుపు తట్టడమేనని రేవంత్ అన్నారు. న్యాయ నిపుణులతో చర్చించి.. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఏ విధంగా తగ్గించాలో ఆలోచించి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంపై పెద్ద బకాయిదారని.. రూ.12,000 కోట్లు తక్షణం చెల్లించాలని రేవంత్ డిమాండ్ చేశారు. రూ.16 వేల కోట్ల నష్టాన్ని పూడ్చుకోవడానికి జనంపై భారం మోపారని ఆయన పేర్కొన్నారు. కరోనా వల్ల పనులు లేక, వ్యాపారాలు దివాళా తీసి, రైతుల పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. 

అంతకుముందు విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ గురువారం నాడు విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా నిర‌సిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళ‌న‌కు దిగాయి. టీఆర్‌ఎస్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం తీరుకు నిరసనగా ఖైరతాబాద్‌లోని విద్యుత్‌ సౌధ భవనాన్ని ఘెరావ్‌ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఆ పార్టీ సీనియర్‌ నేతలను పోలీసులు గురువారం గృహనిర్బంధం చేశారు. వరి సేకరణ సమస్య మరియు ఇంధన ధరల పెరుగుదల, విద్యుత్ చార్జీల పెంపు, ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌పై కాంగ్రెస్ ఆందోళ‌న‌కు దిగింది. 

నిరసనకు ముందస్తు అనుమతి లేనందున నిర్బంధించామని పోలీసులు తెలిపారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు నిర్వహిస్తున్న నిరసనలపై పోలీసుల తీరుపై రేవంత్‌ ప్రశ్నించారు. మాకు వర్తించే నిబంధనలు టీఆర్‌ఎస్‌కు ఎందుకు వర్తించవు? అని ప్ర‌శ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావులను 'సయామీ ట్వీన్స్' (Siamese twins) అని విమ‌ర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతున్నాయ‌ని ఆరోపించారు. మోడీ, కేసీఆర్ ఇద్ద‌రు ఇంధనం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి మధ్యతరగతి ప్రజలను అదే రీతిలో దోచుకుంటున్నారని మండిపడ్డారు.