వరంగల్‌లో జరిగిన కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీతో పాటు ధరణీ పోర్టల్‌ను రద్దు చేస్తామని ఆయన వెల్లడించారు. 

తెలంగాణ అంటే మాకు నినాదం కాదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వరంగల్‌లో జరుగుతున్న రైతు సంఘర్షణ సభలో రైతులపై తీర్మానం ప్రవేశం పెట్టారు రేవంత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అంటే ఎన్నికలకు ముడి సరుకు కాదన్నారు. తెలంగాణ అంటే పేగు బంధం.. ఆత్మగౌరవమన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ సంపూర్ణ బాధ్యత తీసుకుంటుందని రేవంత్ స్పష్టం చేశారు. రైతుల 2 లక్షల రుణమాఫీ చేస్తామని.. ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెస్తామని ఆయన తెలిపారు. ఏటా కౌలు రైతులకు 12 వేల ఆర్ధిక సాయం చేస్తామని.. అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 

రైతు కూలీలు, కౌలు రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తామని.. ఆదివాసీలకు పోడు భూములపై యాజమాన్య హక్కు కల్పిస్తామన్నారు. రైతుల పాలిట శాపంగా మారిన ధరణీ పోర్టల్ రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సరికొత్త రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని.. నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా చేసేవారిపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తామని రేవంత్ వెల్లడించారు. కమీషన్ ఏర్పాటు చేసి రైతుల హక్కుల్ని కాపాడతామని.. పత్తికి రూ.6,500 గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. పసుపు క్వింటాల్‌ను రూ.12 వేలుకు కొనుగోలు చేస్తామని.. మూతపడిన చెరుకు ఫ్యాక్టరీలను తెరిపిస్తామని రేవంత్ తెలిపారు.

పంటలకు మెరుగైన గిట్టుబాటు ధరను కల్పించడమే కాకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతును రాజుగా మారుస్తామని మాటిచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో పండించే వరి ధాన్యాన్ని క్వింటా 1960 రూపాయల నుంచి 2500రూపాయల వరకు చెల్లిస్తామని డిక్లరేషన్‌లో ప్రకటించారు రేవంత్. అలాగే మొక్కజొన్నకు 2200 రూపాయలు, కందులు... 6300 రూపాయల నుంచి 6700 చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పత్తి క్వింటాకు 6025 నుంచి 6500 చెల్లిస్తామని కాంగ్రెస్‌ భరోసా ఇచ్చారు. మిర్చి 15000 రూపాయలు, పసుపు 12000 రూపాయలు, ఎర్రజొన్న, చెరుకు 4000 చెల్లిస్తామని డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్‌ పార్టీ. 

వీటితో పాటు తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ..చివరి ఎకరా వరకు నీళ్లు అందిస్తామని రేవంత్ తెలిపారు. నూతవ వ్యవసాయ విధానం ద్వారా లాభసాటి సాగు విధానాలను ప్రవేశపెడతామని ఆయన స్పష్టం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతును రాజుగా మార్చడమే లక్ష్యంగా ఈ రైతు డిక్లరేషన్‌ని కాంగ్రెస్ ప్రకటించినట్లు రేవంత్ వెల్లడించారు.