తెలంగాణ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కళ రేపటితో తీర నుంచి. తెలంగాణ సీఎం కేసీఆర్ చేతల మీదుగా కాళేశ్వరం ప్రాజెక్టు రేపు ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుతో రైతుల సాగు, తాగునీటి సమస్యలు తీరనున్నాయి. కాగా... ఈ ప్రాజెక్టు కోసం మాజీ మంత్రి హరీష్ రావు ఎంతగానో కృషి చేశారు.కానీ ఇప్పుడు ఆయనను కేసీఆర్ దూరం పెట్టేశారు. ఈ క్రమంలో.. ఆయన పేరుని కాంగ్రెస్ ప్రస్తావిస్తూ ఉంది.

రేపే ప్రారంభోత్సవం కావడంతో హరీష్ రావుని కూడా ఆహ్వానించాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లకు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం కాదని, ప్రాజెక్టుల్లో అవినీతికి తాము వ్యతిరేకమని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. 

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను విడగొట్టి..ఎందుకు నిర్వహించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ వ్యక్తిని, పార్టీని సంతృప్తి పరచడానికి వేరుగా ఎన్నికలు నిర్వహించారని చిన్నారెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి హరీష్‌రావును కూడా పిలవాలన్నారు. ఇప్పుడు తామే కష్టపడ్డట్లు తండ్రి, కొడుకులు..గొప్పగా చెప్పుకోవడం సరికాదని చిన్నారెడ్డి అన్నారు.

ఇదే విషయంపై మరో కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ మాట్లాడుతూ...రాష్ట్ర ప్రజలు పూర్తి మెజార్టీ టీఆర్ఎస్‌కు ఇచ్చినా కేసీఆర్‌ వైఖరిలో మాత్రం మార్పులేదన్నారు. హరీష్‌రావుకు పేరొస్తుందనే...కాళేశ్వరం సాధకుడినని కేసీఆర్‌ చెప్పుకుంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కేసీఆర్‌ విగ్రహం పెట్టడం దౌర్భాగ్యమని సంపత్ కుమార్ అన్నారు.