Asianet News TeluguAsianet News Telugu

Todays Top Stories: కారు నుంచి కమలంలోకి.. విభేదాలతోనే ఈసీ రాజీనామా?

ఈ రోజు టాప్ వార్తలు ఇవే. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి కీలక నాయకులు మారారు. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు.
 

todays top news brs ex mps, mlas jumping to bjp and other stories kms
Author
First Published Mar 11, 2024, 6:25 AM IST

బీఆర్ఎస్ టు బీజేపీ:

ఆదిలాబాద్ మాజీ ఎంపీ గోడం నగేష్, మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ లు, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావులు ఆదివారం రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ సమక్షంలో ఢిల్లీలో బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు మరో కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గోమాసే కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. ఇతర పార్టీల నాయకులు తమ వారసుల భవిష్యత్తు కోసం పనిచేస్తుంటే, మోడీ దేశం కోసం పనిచేస్తున్నారని కే లక్ష్మణ్ అన్నారు. వారసత్వ, అవినీతి పార్టీలతో ప్రజలు విసిగిపోయారని తరుణ్ చుగ్  పేర్కొన్నారు.

ఈసీ రాజీనామాపై చర్చ:

మార్చి 15వ తేదీలోపు ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించే అవకాశాలు ఉన్నాయని కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అనూప్ చంద్ర పాండే రిటైర్‌మెంట్, అరుణ్ గోయల్ సంచలన రాజీనామాలతో ఎన్నికల కమిషన్‌లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. పీఎం మోడీ సారథ్యంలో సెలెక్షన్ కమిటీ మార్చి 13 లేదా 14వ తేదీలలో భేటీ అవుతుంది. ఆ తర్వాత మార్చి 15వ తేదీన కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించే అవకాశం ఉన్నదని విశ్వసనీయవర్గాలు వివరించాయి. బెంగాల్‌లో పోలింగ్ పై సీఈసీతో అరుణ్ గోయల్‌కు అభిప్రాయ భేదాలు వచ్చినట్టు చర్చిస్తున్నారు. బెంగాల్ పర్యటన మధ్యలోనే ఢిల్లీకి వెళ్లి పదవికి రాజీనామా చేశారని చెబుతున్నారు. కేంద్రం కోరినా.. అరుణ్ గోయల్ వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు. ఒత్తిడి గోయల్ తలవంచలేదని, ఆయనకు తన సెల్యూట్ అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.

కాటిపల్లి ఫైర్:

బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై మండిపడ్డారు. కామారెడ్డిలో ప్రోటోకాల్ రగడ కొన్నాళ్లుగా సాగుతున్నది. ఈ సందర్భంలో ఆయన మీడియా తో మాట్లాడారు. తెలంగాణలో 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సాధిస్తుందని అన్నారు. అప్పుడు తానే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక.. తన గర్ల్‌ఫ్రెండ్‌కు క్యాబినెట్ హోదా ఇస్తానని అన్నారు. ఇలా ఇయ్యోచ్చా? ఇయ్యొచ్చు అనుకుంటే తాను కూడా తయారు చేసుకుంటానని పేర్కొన్నారు. 

రేవంత్‌కు కేటీఆర్ సవాల్:

మేడిగడ్డ బ్యారేజీ పనులకు మరమ్మతులు చేయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం కామారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ లోక్సభ సన్నాహక సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను ఈ నెల 17వ తేదీ లోపు అమలు చేయాలని అన్నారు. ఆ రోజుతో కాంగ్రెస్ పార్టీ చెప్పిన 100 రోజుల గడువు ముగుస్తుందని అన్నారు. గడువులోగా హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఉద్యమం చేస్తుందని అన్నారు. 

14లోపే షెడ్యూల్: జగన్

14వ తేదీలోపే ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మేదరిమెట్ల సిద్ధం సభలో పాల్గొని మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయని తెలిపారు. ఆయన జేబులో మరో నేషనల్ పార్టీ కూడా ఉందని తెలిపారు. వీరంతా కలిసి ఏపీ భవిష్యత్ పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు.

లోక్ సభ బరిలో యూసుఫ్ పఠాన్

భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ రాజకీయాల్లోకి రానున్నారు. ఆయనను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 2024 లోక్ సభ బరిలో నిలిపింది. పశ్చిమ బెంగాల్లోని బహరంపూర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో ఉంటారని టీఎంసీ స్పష్టం చేసింది. 

400 సీట్లిస్టే రాజ్యాంగాన్ని మార్చేస్తాం

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లకు పైగా గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని బీజేపీ సీనియర్ లీడర్ అనంత హెగ్డే అన్నారు. పీఠిక నుంచి లౌకిక అనే పదాన్ని తొలగిస్తామని వివరించారు. హిందూ సమాజాన్ని అణచివేసేలా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అనవసర చేర్పులను తొలగిస్తామని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios