కొడంగల్‌: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ జనసమితి అధినేత ప్రజాఫ్రంట్ కన్వీనర్ కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఫాంహౌస్ లో పడుకున్న కేసీఆర్ ను ఫాం హౌస్ కే పరిమితం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో జరుగుతున్న కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్న కోదండరామ్ కేసీఆర్ పై మండిపడ్డారు. 

కేసీఆర్ లా తాము మాటలు చేప్పే వాళ్లం కాదని పనులు చేసి చూపించే వాళ్లమని ప్రజలు తమ కూటమిని ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి కోసమే తాము కూటమిగా ఏర్పడినట్లు కోదండరామ్ తెలిపారు. ఈ కూటమి తెలంగాణ అభివృద్ధికి కాపలా కాస్తుందన్నారు. 

ప్రజాకూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపారు. చిన్న పరిశ్రమల స్థాపన కోసం కృష్టి చేస్తామన్నారు. తెలంగాణలో యువతకు బతుకుదెరువు చూపిస్తామని హమీ ఇచ్చారు. 

వంద యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ లా జనం గోడు పట్టని విధానాలు ఉండవన్నారు. మా గత చరిత్ర చూసి ప్రజాకూటమిని విశ్వసించాలని కోదండరామ్ కోరారు. 

మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కొడంగల్‌ కొదమసింహమని టీజేఎస్ అధినేత కోదండరాం అభివర్ణించారు. రేవంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రేవంత రెడ్డి గెలుపు తెలంగాణ అభివృద్ధిలో మలుపు కాబోతుందన్నారు.  
 
మరోవైపు నీటివాటం ఎటుందో తెలియకుండా ప్రాజెక్టులు డిజైన్‌ చేశారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేసీఆర్ మండిపడ్డారు. డిజైన్ సరికాదని చెప్తే నువ్వు మాకు చెప్పేటొనివా అంటూ హేళన చేశారన్నారు. ఇది కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి డిజైన్‌ చేసిన ప్రాజెక్టులు అని అర్థమైందన్నారు. 

అందుకే ఈ ప్రభుత్వం ఉండటానికి అర్హత లేదని చెప్పుకొచ్చారు. ప్రజలకు మంచి చేసేందుకే కూటమిగా ఏర్పడ్డామన్నారు. తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటానన్నారు. కేసీఆర్‌లాగా మేము మాటలు చెప్పం. తెలంగాణ అభివృద్ధి కోసమే కూటమిగా ఏర్పడ్డామని తమని ఆశీర్వదించాలని కోరారు.