కరోనా లాక్ డౌన్ వేళ ప్రజలంతా ఈ మహమ్మారి నుండి బయటపడడం కోసం ఇండ్లలోనే ఉంటున్న విషయం తెలిసిందే. కానీ ఇలా ప్రజలంతా ఇండ్లలోనే ఉంటున్న వేళ పారిశుధ్య కార్మికులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ వైరస్ పంజా ప్రజల మీద పడకుండా కాపాడుతున్నారు. 

ఇలా ఫ్రంట్ లైన్ లో పనిచేస్తున్న వారందరి సేవలు వెలకట్టలేనివి. అలాంటి వారి సేవలకు మనం థాంక్యూ తప్ప ఏమి చెప్పగలము? ప్రధాని నరేంద్ర మోడీ గారు చప్పట్లు కొట్టమని పిలుపు ఇచ్చింది కూడా ఇందుకే. 

ఇలా ఫ్రంట్ లైన్ లో ఉన్నవారందరి సేవలకు ప్రజాప్రతినిధిగా ప్రజల తరుఫున ధన్యవాదాలు తెలుపుతూ.... ఈ లాక్ డౌన్ వేళ ఆ ఫ్రంట్ లైన్ వర్కర్లకు పండ్లను పంచారు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్. 

ఈ కరోనా పై పోరాటంలో ప్రజలందరితోపాటుగా ఈ కరోనా పై పోరాటంలో ముందుండి పోరు సలుపుతున్న సైనికులు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే తెలంగాణ సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అప్పుడే ఈ కరోనా మహమ్మారిపై అందరం విజయం సాధించగలమని అన్నారు. 

ఉప్పల్ కళ్యాణపురిలోని తన నివాసంలో పారిశుధ్య కార్మికులకు పండ్లను పంచారు. ఆ తరువాత రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే ఉప్పల్ డీసీపీ కార్యాలయంలో పోలీసు సిబ్బందికి సైతం పండ్లను పంచారు. ఈ కరోనా పై యుద్ధంలో ముందుండి వారు సలుపుతున్న పోరాటం అందరికి ఆదర్శనీయం, ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అని ఈ సందర్భంగా ఈ ఫ్రంట్ లైన్ వర్కర్ల సేవలను ఉద్దేశించి కిషోర్ అన్నారు.