పందుల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఆరు బయట ఆడుకుంటుండగా.. పందులు చిన్నారిపై దాడి చేయడం గమనార్హం. కాగా.. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...రంగారెడ్డి జిల్లా మైసిగండి వస్తాపురం తండాకు చెందిన వడిత్యా కేశ్యానాయక్‌, చిట్టి దంపతులు కూలీలు. సింగరేణి కాలనీలోని గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. వారికి ఓ కూతురు, కుమారుడు హర్షవర్ధన్‌(3) ఉన్నారు. మంగళవారం సాయంత్రం తల్లి ఇంట్లో పనులు చేసుకుంటోంది.

కాగా.. చిన్నారి హర్షవర్థన్ ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అటుగా ఓ పందుల గుంపు వచ్చింది. వెంటనే బాలుడిని నోట కరుచుకొని లాక్కెళ్లాయి.  ఒక్కసారిగా బాబుపై దాడి చేసి గొంతు, కడుపు భాగంలో తీవ్రంగా గాయపరిచాయి. బాలుడు తీవ్రమైన రక్త స్రావం కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. 

గమనించిన స్థానికులు పందులను చెదరగొట్టి.. బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే.. అప్పటికే ఆ బాలుడు తీవ్రగాయాలతో ప్రాణాలు విడిచాడు. 

ఈ సంఘటనతో సింగరేణి కాలనీ బస్తీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ బాలుడి తల్లిదండ్రులు విలపిస్తుండడం అందరినీ కలచి వేసింది. ఆ ప్రాంతంలో పందుల సమస్య ఎప్పటి నుంచో ఉందని స్థానికులు అంటున్నారు.