రెండు పెళ్లిళ్లు చేసుకుని, ఇద్దరు భర్తలకు వదిలేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఓ మహిళను దారుణంగా చంపేశాడు భర్త.  మూడో పెళ్లి చేసుకున్న తనతో కాకుండా మరో వ్యక్తితో కూడా తిరుగుతుందన్న అనుమానం పెంచుకున్న భర్త కత్తితో దాడిచేసి హత్య చేశాడు. 

ఈ సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ రవిందర్‌ తెలిపిన మేరకు.. మహరాష్ట్రకు చెందిన పర్హాన ఖురేషీ(25) ఇద్దరు భర్తలను వదిలేసి ఇద్దరు కుమారులు, కూతురుతో నాందేడ్‌లో ఉండేది. రెండు సంవత్సరాల క్రితం బీదర్‌కు చెందిన కిరోసిన్‌ డీలర్‌ మహ్మద్‌ మోసిన్‌ ఖాన్‌(31) పరిచయమయ్యాడు. 

తరువాత ఇద్దరూ సహజీవనం చేశారు. ఐదు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పిల్లలతో కలిసి అంజయ్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా మోసిన్‌కు తెలియకుండా పర్హాన బయటకు వెళుతుండేది. దీంతో మోసిన్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో బుధవారం భార్యను నిలదీయగా రూ.10 లక్షలు ఇచ్చి, విడాకులు ఇస్తే తన దారిన తాను వెళతానని పర్హాన భర్తకు తెగేసి చెప్పింది. 

ఆవేశానికి గురైన మోసిన్‌ ఖాన్‌ కూరగాయల కత్తితో కడుపులో రెండు చోట్ల పొడిచి ఆపై గొంతు కోశాడు. గమనించిన స్థానికులు 100కు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాత్‌ రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న పర్హనా ఖురేషీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ  అర్థరాత్రి తరువాత మృతి చెందింది. నిందితుడు మహ్మద్‌ మోసిన్‌ ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు.