తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఇంట్లో భారీ  చోరీ జరిగింది. ఇంట్లో దాచి ఉంచిన లక్షల విలువైన బంగారం, వెండి నగలను దొంగలు దోచుకెళ్లడం గమనార్హం. కాగా... ఈ సంఘటన హైదరాబాద్ లోనే చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు 305 ఫ్లాట్‌ కేటాయించారు. అయితే ఆ ఫ్లాట్‌లో ఎమ్మెల్యే బంధువు అమర్‌నాథ్ బాబు కుటుంబం కొంతకాలంగా నివసిస్తోంది. శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లాట్‌లో దొంగతనానికి పాల్పడ్డారు. 
ఫ్లాట్‌లోకి వెళ్లిన దొంగలు 14.6 తులాల బంగారం, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారు. అయితే ఈ విషయంపై ఆబిడ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, నారాయణగూడ సీఐ రమేశ్‌కుమార్ వివరాలు వెల్లడించకుండా చోరీపై గోప్యత పాటిస్తున్నారు.

పోలీసులు పదుల సంఖ్యలో సెక్యూరిటీ ఉండే క్వార్టర్ట్స్‌లో చోరీ కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమర్‌నాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో తమ డ్రైవర్ ఇంట్లో పలు వస్తువులు కూడా దొంగతనానికి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

వేసిన తాళాలు వేసినట్లు ఉండడం, లోపలికి ఎవరూ రాకపోవడంతో ఇంటిదొంగ పనే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్ ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండడంతో పోలీసులు డ్రైవర్‌పై అనుమానిస్తున్నారు. ఈ క్వార్టర్స్‌ ఇటీవల కొత్తగా నిర్మించిన విషయం తెలిసిందే.