ప్రముఖ డాక్టర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది.  ఇంట్లో దాచిన దాదాపు 30 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

బంజారాహిల్స్‌కు చెందిన ప్రముఖ డాక్టర్‌ పొట్లూరి రాజేశ్వరరావు, అనంతలక్ష్మి దంపతులు. గత ఏడాది ఆగస్టులో ఓ శుభకార్యానికి వెళ్లివచ్చిన అనంతలక్ష్మి తన నగలను బీరువాలో భద్రపరిచారు. డిసెంబర్‌లో నగల కోసం బీరువా తెరవగా, కనిపించలేదు.

ఇంట్లో పనిచేసే బద్రి గత సెప్టెంబర్‌లో కుటుంబీకుల అంతిమ సంస్కారాల కోసమని స్వగ్రామానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో వారికి బద్రీపై అనుమానం పెరిగింది. బద్రీని సంప్రదించేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో బాధితులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 80గ్రా.బంగారు గాజులు, 30గ్రా. చైన్‌, 156 గ్రా. కెంపు లాకెట్‌, హారం, 30గ్రా. మరో లాకెట్‌, రెండు వెండి వస్తువులు చోరీకి గురైనట్టు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.