Asianet News TeluguAsianet News Telugu

వామనరావు దంపతుల హత్య కేసు... అసలు కారణం ఇదే..!

గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్‌ ఇంటి నిర్మాణాన్ని వామన్‌రావు అడ్డుకోవడం, ఊరిలో నిర్మిస్తున్న దేవాలయం పనులకు అభ్యంతరం తెలపడం, రామాలయ కమిటీ వివాదాల కార ణంగా హత్యలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వివరించారు.

The Main Reason behind The Lawyer Vamana rao Couple Death case
Author
Hyderabad, First Published Feb 19, 2021, 7:30 AM IST

హైకోర్టు న్యాయవాద దంతులు వామనరావు, నాగమణిలు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. కాగా... వీరి హత్యలకు గ్రామంలో ఎప్పటి నుంచో ఉన్న గొడవలే కారణమని పోలీసులు చెబుతున్నారు. కాగా.. ఈ హత్యకు నిందితులు ఉపయోగించిన నల్లని బ్రీజా కారు పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనుదని తెలుస్తోంది.

కాగా... ఈ హత్యలకు సంబంధించిన విషయాలను పోలీసులు మీడియాకు వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్, బిట్టు శ్రీను కారు డ్రైవర్‌ శివందుల చిరంజీవి కలిసి కొబ్బరికాయలు నరికే కత్తులతో ఈ హత్యాకాం డకు పాల్పడ్డారని తెలిపారు. గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్‌ ఇంటి నిర్మాణాన్ని వామన్‌రావు అడ్డుకోవడం, ఊరిలో నిర్మిస్తున్న దేవాలయం పనులకు అభ్యంతరం తెలపడం, రామాలయ కమిటీ వివాదాల కార ణంగా హత్యలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వివరించారు.

‘రిజిస్ట్రేషన్‌ కాని బ్రీజా కారును, కొబ్బరికాయలు కోసే కత్తులను బిట్టు శ్రీను సమకూర్చగా.. అతడి కారు డ్రైవర్‌ చిరంజీవితో కలిసి కుంట శ్రీనివాస్‌ నడిరోడ్డుపై హత్యాకాండకు తెగబడ్డాడు. కుంట శ్రీనివాస్‌ను ఏ1గా, చిరంజీవిని ఏ2గా, అక్కపాక కుమార్‌ను ఏ3గా పేర్కొంటూ కేసు నమోదు చేశాం. కుంట శ్రీనివాస్, చిరంజీవిని గురువారం మహారాష్ట్ర సరిహద్దుల్లో అరెస్టు చేశాం. కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకున్నాం. వామన్‌రావు తండ్రి ఫిర్యాదు మేరకు రిటైర్డ్‌ డీఈ వసంతరావుకు ఈ కేసులో ఏమైనా ప్రమేయం ఉందా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నాం. హత్య చేయడానికి కారు, కత్తులను సమకూర్చిన బిట్టు శ్రీను కోసం గాలిస్తున్నాం’అని పోలీసులు చెప్పారు.

బిట్టు శ్రీను అనే వ్యక్తి నుంచి నల్లని బ్రీజా కారును, రెండు కొబ్బరి కాయలు కోసే కత్తులు తీసుకుని అతడి డ్రైవర్‌ చిరంజీవితో కలిసి మధ్యాహ్నం సమయంలో కల్వచర్ల శివారులో కాపు కాశాడు. వామన్‌రావు కారు రాగానే దానిని ఢీకొట్టి కారు ఆపారు. అనంతరం కుంట శ్రీను కత్తి తీసుకుని వెళ్లి కారు అద్దం పగలగొట్టాడు. దీంతో డ్రైవర్‌ భయపడి కారు దిగిపోవడంతో వామన్‌రావు డ్రైవర్‌ సీట్లోకి వచ్చి కారు నడిపే ప్రయత్నం చేశారు. వెంటనే కుంట శ్రీను ఆయన్ను కారులో నుంచి బయటకు లాగి కత్తితో దాడి చేశాడు.

అదే సమయంలో చిరంజీవి రెండోవైపు నుంచి వచ్చి వామన్‌రావు భార్య నాగమణిపై కత్తితో దాడి చేయడంతో ఆమె కారులోనే కుప్పకూలిపోయారు. తర్వాత చిరంజీవి కూడా వామన్‌రావు వద్దకు వచ్చి విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం ఇరువురూ బ్రిజా కారులో ఇంక్లైన్‌ కాలనీ నుంచి సుందిళ్ల బ్యారేజీ వైపు వెళ్లిపోయారు. రక్తపు మరకలు అంటున్న బట్టలు, దాడికి ఉపయోగించిన కత్తులను సుందిళ్ల బ్యారేజీలో పడేసి, అక్కడి నుంచి మహారాష్ట్ర వైపు పారిపోయారని పోలీసులు చెప్పారు. 

వామన్‌రావుకు తన గ్రామానికే చెందిన కుంట శ్రీనివాస్‌తో ఐదేళ్లుగా వివాదాలున్నట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఇటీవల గుంజపడుగులో ఉన్న రామస్వామి గోపాలస్వామి దేవాలయం మేనేజ్‌మెంట్‌ కమిటీ వివాదంతోపాటు ఇల్లు, కుల దేవత పెద్దమ్మ ఆలయం నిర్మాణాలు నిలిపివేయించారనే కక్షతోనే కుంట శ్రీను వామన్‌రావును చంపాలని కుట్ర పన్ని, బిట్టు శ్రీను సహకారంతో హత్య చేసినట్లు వివరించారు. కుంట శ్రీనివాస్‌ గతంలో నిషేధిత సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)లో పనిచేశాడని, బస్సు దహనం, 498ఏ కేసుల్లో నిందితుడని తెలిపారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios