హైదరాబాద్: విజయంపై ఓ వైపు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), మరో వైపు కాంగ్రెసు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ తమకు 75 సీట్లు వస్తాయని కాంగ్రెసు నాయకులు చెబుతుండగా, తమ సంఖ్య వంద దాటుతుందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అయితే, ఈ రెండింటి భవిష్యత్తును నిర్ణయించేది 45 సీట్లు. ఈ 45 సీట్లలో ప్రజా కూటమి, టీఆర్ఎస్ పార్టీల మధ్య ముఖాముఖీ పోటీ ఉంటుంది. ఆ పోటీ హోరాహోరీ కూడా ఉంటుంది. 

రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం - టీఆర్ఎస్ కు 32 సీట్లలో కచ్చితమైన విజయావకాశాలున్నాయి. కాంగ్రెసు పార్టీకి 32 సీట్లలో ఆ అవకాశాలున్నాయి. ఈ పార్టీకి కూడా గాలివాటం లేని స్థితిలో ఈ ధోరణి మారే అవకాశాలు లేకపోలేదు. 

మజ్లీస్ ఏడు సీట్లలో, తెలుగుదేశం ఐదు సీట్లలో, సిపిఐ ఒక్క సీటులో ఆధిక్యం కనబరుస్తున్నాయి. బిజెపి నాలుగు సీట్లను గెలిచే అవకాశం ఉంది. బిజెపి కొన్ని సీట్లలో టీఆర్ఎస్ కు, మరికొన్ని సీట్లలో ప్రజా కూటమికి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. 

మిత్రులతో కలిసి టీఆర్ఎస్ బలం 39 సీట్లకు చేరుకుంటుంది. అధికారాన్ని చేపట్టడానికి 22 సీట్లు తక్కువ పడుతాయి. అయితే, గట్టి పోటీ ఉన్న 45 సీట్లలో టీఆర్ఎస్ సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకోవాల్సి ఉంటుంది. 

కాంగ్రెసు పార్టీకి అధికారం చేపట్టడానికి 28 సీట్లు తక్కువ పడుతాయి. మిత్రులతో కలిపితే దాని బలం 33కు చేరుకుంటుంది. అందువల్ల ఆ 45 సీట్లలో ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనేదానిపైనే కాంగ్రెసు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురువుతోంది. అభ్యర్థులను వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎక్కువ మంది కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందువల్ల టీఆర్ఎస్ భవిష్యత్తు మొత్తం కేసిఆర్ ఇమేజ్ పైనే ఆధారపడి ఉంది.