ఒక్కోసారి రెప్పపాటున జరిగే ప్రమాదాలకు అతి భయంకరమైన చావులు దర్శనమిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఏంపరవాలేదు అని ముందడుగేస్తే యమధర్మరాజు రెడీగా ఉంటాడు. అయితే నాలుగంతస్థుల భవనం నుంచి కిందపడితే చాలా వరకు మనిషి మృత్యు ఒడిలోకి చేరినట్లే. కానీ ఓ బాలుడు మాత్రం చాకచక్యంగా వ్యవహరించి మృత్యుంజయుడయ్యాడు. 

అసలు వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ రాంనగర్ కు చెందిన దేవరాజు - ధనలక్ష్మి ల తనయుడు సిద్దార్థ నాలుగో అంతస్థు నుంచి కింద పడినా ప్రాణాలతో బయటపడ్డాడు. బిల్డింగ్ పైన వాటర్ ట్యాంక్ నిండిందో లేదో చూడడానికి స్నేహితులతో కలిసి పైకి ఎక్కాడు. అయితే అదుపుతప్పి ఒక్కసారిగా జారిపడిపోయాడు. 

అయితే పక్కన మరో బిల్డింగ్ ఉండడంతో కిటికీల సజ్జలను, పైపులను పట్టుకునేందుకు ప్రయత్నించి కింద పడ్డాడు. ఆ విధంగా పట్టుకోవడంతో చావు నుంచి బయటపడినట్లు బాలుడు తెలిపాడు. తొంటి దగ్గర కొద్దిగా నొప్పి ఉన్నట్లు చెప్పడంతో  తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. డాక్టర్లు కూడా అతనికి పెద్దగా గాయాలు అవ్వలేదని చెప్పారు.