హైదరాబాద్: ప్రముఖ తెలుగు సాహితీవేత్త సీవీ కృష్ణా రావు ఇక లేరు. ఆయన ఆదివారం అర్థరాత్రి హైదరాబాదులోని చైతన్యపురిలో గల తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జరుగుతాయి. నెలనెలా వెన్నెల కార్యక్రమం ద్వారా సాహితీవేత్తలను కూడగట్టి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు అందించారు. 

సీవీ కృష్ణా రావు అప్పటి నల్లగొండ జిల్లా రేవూరు గ్రామంలో 1926 జులై 3వ తేదీన జన్మించారు. జగ్గయ్యపేట, గుంటూరు, హైదరాబాదు, ముంబైల్లో ఆయన విద్యనభ్యసించారు. బికామ్ డిగ్రీ పూర్తి చేయడంతో పాటు గిరిజిన సంక్షేమ పరిపాలనలో సర్టిఫికెట్ కోర్సు చేశారు. 

కొన్నాళ్లు బ్యాంకు గుమస్తాగా పనిచేశారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా పనిచేశారు. సాంఘిక సంక్షేమ శాఖలో వెనుకబడిన తరగతుల సంక్షేమ విభాగం సంచాలకునిగా కొన్నేళ్లు పనిచేసి పదవీ విరమణ చేశారు. సీవీ కృష్ణా రావు తొలి కవితా సంకలనం వైతరణి. ఆ తర్వాత మాదీ మీ వూరే, అవిశ్రాంతం వంటి కవితా సంకలనాలను వెలువరించారు. 

లాతూరు భూకంపానికి చలించి కిల్లారి అనే దీర్షకవితను వెలువరించారు .దాన్ని ఢిల్లీకి చెందిన డాక్టర్ వివీబీ రామారావు ఆంగ్లంలోకి అనువదించారు. కృష్ణా రావు కొన్ని కథలు కూడా రాశారు. తోడేలు జగతి, నోటీసు, భిక్షువులు, విద్యాబోధ, సత్రంలో సంసారం వంటి కథలు రాశారు.