Asianet News TeluguAsianet News Telugu

బాలకృష్ణ ఇష్యూ: గ్లామర్ తగ్గిన టీడీపీ, చంద్రబాబు రాజకీయాలే...

తెలంగాణ రాజధాని హైదరాబాదు నుంచి తెలుగు సినీ పరిశ్రమ తరలిపోయే అవకాశాలు ఏ మాత్రం లేదు. గతంలో మాదిరిగా సినీ ప్రముఖులకు ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు అవసరం లేదు. బాలయ్య వివాదాన్ని ఈ నేపథ్యంలోనే చూడాల్సి ఉంటుంది.

Telugu film industry takes major turn due to Chandrababu politics
Author
Hyderabad, First Published May 30, 2020, 2:47 PM IST

హైదరాబాద్: బాలకృష్ణకు, ఇతర సినీ ప్రముఖులకు మధ్య చోటు చేసుకున్న విభేదాలు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన భారీ మార్చును సూచిస్తున్నాయి. ఇక ఎంత కాలం సినీ పరిశ్రమపై తెలుగుదేశం పార్టీ పట్టు కొనసాగించలేదని అర్థమవుతోంది. సినీ పరిశ్రమలో తిరుగులేని ఆధిపత్యం సాధించి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ స్థాపన ద్వారా రాజకీయాల్లో కూడా ఆధిపత్యం వహించిన ఎన్టీ రామారావు కారణంగా తెలుగు సినీ పరిశ్రమ టీడీపీకి దగ్గరగా ఉంటూ వచ్చింది. 

తెలుగుదేశంపార్టీలో సినీ ప్రముఖులకు అత్యధిక ప్రాధాన్యం ఉంటూ వచ్చింది. టీడీపీ ప్రభుత్వాల్లో కూడా వారికి తగిన ప్రాముఖ్యం లభిస్తూ వచ్చింది. పలువురు సినీ ప్రముఖులు టీడీపీలో చేరి పదవులు కూడా పొందారు. ఎన్నికల్లో పోటీ చేశారు. మురళీ మోహన్ ను ఈ విషయంలో ప్రముఖంగా చెప్పుకోవచ్చు. రాఘవేంద్ర రావు వంటి సినీ ప్రముఖులు కూడా టీడీపీకి అనుకూలంగా ఉంటూ వచ్చారు. దాసరి నారాయణ రావు, ఇంకా కొద్ది మంది మాత్రమే కాంగ్రెసు రాజకీయాల్లో పాల్గొంటూ వచ్చారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు సినీ ప్రముఖులు నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చారు. నిజానికి, మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ప్రస్తుతం సమావేశాలు నిర్వహిస్తున్నవారిలో కూడా బాలకృష్ణకు సన్నిహితులైనవారు ఉన్నారు. సినీ పరిశ్రమ యావత్తూ టీడీపీ వైపు ఉంటుందనే ఓ అభిప్రాయం కొనసాగుతూ వచ్చింది. 

అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితి తారుమారైంది. టీడీపీ తెలంగాణలో కూడా ఉన్నప్పటికీ సినీ గ్లామర్ ఆ పార్టీకి లేకుండా పోయింది .చంద్రబాబు నాయుడు దాదాపుగా తెలంగాణను వదిలేసినట్లే చెప్పవచ్చు. ఆయన పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే తన రాజకీయాలకు కేంద్రంగా ఎంచుకున్నారు. సినీ పరిశ్రమ రెండు వర్గాలుగా చీలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మద్దతుగా కూడా కొంత మంది నిలిచారు, నిలుస్తున్నారు. 

సినీ పరిశ్రమలో ఆంధ్ర పెద్దల ఆధిపత్యాం ఉన్నప్పటికీ పరిశ్రమ మొత్తం హైదరాబాదులో కేంద్రీకృతమై ఉంది. దీంతో తెలంగాణ ప్రభుత్వంతో వారు సాన్నిహిత్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగానే చాలా మంది తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న బాలకృష్ణ, పవన్ కల్యాణ్ వంటి నేతలు కూడా టీఆర్ఎస్ ను గానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గానీ పెద్దగా ఎదిరించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే వాళ్లు ప్రధానంగా పనిచేస్తున్నందున ఆ అవసరం కూడా వారికి లేకుండా పోయింది. హైదరాబాదులోనే వారి సినిమా కార్యకలాపాలు సాగాల్సి ఉండడం కూడా అందుకు ఓ కారణం కావచ్చు.

మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయి, హైదరాబాదు రాష్ట్రం విలీనంతో ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదుకు తరలివచ్చి నిలదొక్కుకోవడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు కేంద్రంగా విస్తరిస్తూ వచ్చింది. మద్రాసు నుంచి సినీ పరిశ్రమ హైదరాబాదు తరలిరావడానికి చాలా కష్టాలే పడాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాదు వంటి నగరం లేదు. అందువల్ల సినీ పరిశ్రమ హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిపోవడం అంత సులభం కాదు. కానీ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో సమాంతరంగా కొంత  అభివృద్ధి చెందే అవకాశాలు మాత్రం ఉన్నాయి. షూటింగులు చేసుకోవడానికి తగిన ప్రదేశాలు ఉన్నాయి.  

పైగా, ప్రస్తుతం చాలా మంది హీరోలు తెలంగాణ పుట్టిపెరిగినవారు. తెలంగాణతో బంధుత్వాలను కలుపుకుంటున్నవారున్నారు. అందువల్ల ప్రస్తుత సినీ పరిశ్రమలో ప్రముఖ నటులుగా ఎదుగుతున్నవారంతా తెలంగాణను సొంతం చేసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. దానికితోడు, తెలంగాణవాళ్ల పాత్ర సినీ పరిశ్రమలో పెరుగుతూ వస్తోంది. అందువల్ల సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోయే అవకాశాలు చాలా తక్కువ.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం సినీ ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వంతో వ్యవహారాలు నడపాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల వారికి చంద్రబాబు అవసరం లేకుండా పోయింది. దానికితోడు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికారంలో లేరు. ఈ నేపథ్యంలోనే సినీ పరిశ్రమలో బాలయ్య ప్రాముఖ్యం తగ్గిందని చెప్పడానికి వీలుంటుంది. ఆ మాటకొస్తే జూనియర్ ఎన్టీఆర్ కు ప్రాముఖ్యం ఉంటుంది. 

చాలా మంది సినీ ప్రముఖులు హైదరాబాదులో స్టూడియోలు నిర్మించుకున్నారు. థియేటర్లు కూడా పెద్ద యెత్తున నిర్మించుకున్నారు. అందువల్ల హైదరాబాదులోని ఆస్తిపాస్తులను వదిలేసి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిపోతారని అనుకోవడానికి ఏ మాత్రం వీలు లేదు. ఈ స్థితిలోనే చిరంజీవి, నాగార్జున తదితరుల సహకారంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, తమ కార్యకలాపాలకు తగిన వెసుులుబాట్లను పొందడానికి వారు ప్రయత్నిస్తున్నారు. బాలకృష్ణ ఉదంతాన్ని ఈ నేపథ్యంలోనే చూడాల్సి ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios