నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ఓ లాడ్జిలో తెలంగాణ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వెంకటేష్ గా పోలాసులు గుర్తించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... చామినేని వెంకటేష్(29) ఈనెల 26వ తేదీన సూళ్లూరుపేటలోని ఆర్కే లాడ్జికి వచ్చాడు. తాను ఓ ఫ్యాక్టరీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నట్లు చెప్పి లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. తిరోజూ ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేవాడు. సోమవారం మధ్యాహ్నం 2.30గంటలకు అన్నం ప్యాకెట్‌తో వచ్చి రూములోకి వెళ్లాడు. 

మంగళవారం కూడా తలుపులు తీయకపోవడంతో లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు తెరచి చూడగా మరుగుదొడ్డిలో ఆ యువకుడు మృతి చెంది ఉన్నాడు. గదిలో సంచిలో బీరుసీసా, పురుగుల మందు డబ్బా ఉండటంతో పురుగు మందు బీరులో కలుపుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

మృతుడి వద్ద దొరికిన ఆధార్‌ కార్డు ఆధారంగా యాదాద్రి జిల్లా వలిగొండ మండలం, రెడ్లరేపాక గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. అతడి బంధువులకు సమాచారం అందజేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ మేరకు సూళ్లురుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.