హైదరాబాద్ కి చెందిన యువతిని ఓ ట్రావెల్‌ ఏజెంట్‌ నిలువునా మోసం చేశాడు. దుబాయ్ కి పంపిస్తానని చెప్పి ఆమెను అమ్మేశాడు. ఇప్పుడా మహిళ దుబాయ్‌ షేక్‌ చేతికి చిక్కి నరకం అనుభవిస్తోంది. 

వివరాల్లోకి వెడితే నగరానికి చెందిన నూర్‌ అనే యువతికి ట్రావెల్‌ ఏజెంట్‌ ఒకరు దుబాయ్‌కు పంపిస్తామని మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో రెండు లక్షలు తీసుకుని దుబాయ్‌ షేక్‌కు ఆమెను అమ్మేశాడు. 

అంతటితో ఊరుకోకుండా ఆ షేక్ తో బలవంతంగా కాంట్రాక్ట్‌ మ్యారేజీ చేయించాడు. అప్పటి నుంచి దుబాయ్‌ షేక్‌ నూర్‌పై అత్యాచారానికి పాల్పడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. 

అతడు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక నూర్ అతడి నుంచి ఎలాగోలా తప్పించుకుని, మరోచోట తలదాచుకుంది. ఈ విషయం తెలుసుకున్న షేక్‌ ఆమె ఆచూకీ కనిపెట్టి ఇంటికి తీసుకువచ్చి మళ్లీ హింసించడం ఆరంభించాడు. 

అతడికి తెలియకుండా తన తల్లికి ఫోన్‌ చేసిన నూర్‌ తనను ఎలాగైనా కాపాడాలంటూ వేడుకుంది. ఈ విషయం గురించి మీడియాతో గోడు వెళ్లబోసుకున్న ఆమె తల్లి తన కుమార్తెను ఎలాగైనా రక్షించి హైదరాబాద్‌కు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.