తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో జీవో 111ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు పర్యావరణ, సామాజిక కార్యకర్తలు తప్పుబడుతున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో జీవో 111ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రకటించారు. 26 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ జీవోను తీసుకొచ్చారు. హైదరాబాద్ జంట జలశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరిరక్షణ కోసం 1996లో జీవో 111ను తీసుకొచ్చారు. అయితే వికరాబాద్, రంగారెడ్డిజిల్లాల ప్రజల నుంచి వచ్చిన వినతి మేరకు ఆ జీవోను రద్దు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కేసీఆర్ జీవో 111ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక, ఇటీవల అసంబ్లీ సమావేశాల్లో జీవో 111ని ప్రభుత్వం త్వరలోనే రద్దు చేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జీవో అర్దరహితం అని పేర్కొన్నారు. “ఆ సమయంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలను తీర్చిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను రక్షించడానికి జీవో జారీ చేయబడింది. అయితే ప్రభుత్వం తాగునీటి సమస్యను అధిగమించడంతో ఆ జీవో నిరుపయోగంగా మారింది’ అని కేసీఆర్ అన్నారు.

‘‘సికింద్రాబాద్ వైపు కంటోన్మెంట్ ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 111 జీవో ఉన్న కారణంగా అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతున్నదని కేబినెట్ అభిప్రాయపడింది. ఇందుకోసం చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన, పురపాలక శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ భాగస్వామ్యంతో కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ ద్వారా రెండు జలాశయాల పరిరక్షణ కోసం నియమ నిబంధనలను, ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు జలాశయాలలోనూ మూసీ, ఈసా నదులలోనూ కాలుష్య జలాలు చేరడానికి వీలు లేకుండా కొత్త జీఓ ను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆమోదం ద్వారా రూపొందించాలని ముఖ్యమంత్రి కమిటీని ఆదేశించారు’’ సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే జీవో 111ను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని పలువురు పర్యావరణ, సామాజిక కార్యకర్తలు తప్పుబడుతున్నారు. దీనిని అప్రజాస్వామిక, చట్టవిరుద్దమైన చర్యగా వారు చెప్పారు. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలను ధిక్కరిస్తుందని వారు చెబుతున్నారు. ఈ అంశంపై తదుపరి నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల కమిటీ నివేదికను సమర్పించాలని ఎన్జీటీ, హైకోర్టు స్పష్టం చేశాయని గుర్తుచేస్తున్నారు. ఇది ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని వారు విమర్శిస్తున్నారు. పర్యావరణంపై ప్రభావం చూపే ఏదైనా చర్య తప్పనిసరిగా ఒక నిర్దిష్ట ప్రక్రియ ద్వారా ముందుకు సాగాలని వారు కోరుతున్నారు. 

జీవో 111 గురించి..
గతంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాగునీటికి ప్రధాన వనరుగా ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అనే రెండు రిజర్వాయర్‌ల ఫుల్ ట్యాంక్ లెవల్‌లో 10 కి.మీ విస్తీర్ణంలో.. భారీ నిర్మాణాలు,పారిశ్రామిక కార్యకలాపాలను నిషేధిస్తూ ఈ ఉత్తర్వు జారీ చేసింది. 1908లో హైదరాబాద్‌ను ముంచెత్తిన వరదలు వేలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఈ క్రమంలోనే నగరం భారీ వరదల బారిన పడకుండా ఉండేందుకు నిజాం పాలకులు.. ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనల తీసుకున్నారు. 

ఆయన సిఫార్సు మేరకు.. వరదల సమయంలో అదనపు నీటిని నియంత్రించేందుకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను నిర్మించారు. 1920లో ఉస్మాన్ సాగర్, 1927లో హిమాయత్ సాగర్‌ల నిర్మాణాలు పూర్తయ్యాయి. తర్వాత కాలంలో ఈ రెండు రిజర్వాయర్లు దశాబ్దాలుగా హైదరాబాద్ నగర ప్రజల తాగు నీటి అవసరాలను తీర్చడంతో పాటు.. వరద నియంత్రణలో ముఖ్యమైన భూమిక పోషించాయి. 

జలాశయాలను రక్షించాలనే ఉద్దేశ్యంతో.. 1996లో జీవో 111ను తీసుకొచ్చారు. క్యాచ్ మెంట్ ఏరియాలో కాలుష్య కార్యకలాపాలను నివారించడానికి..సమీప ప్రాంతంలో పారిశ్రామిక, వాణిజ్య, భారీ నివాస నిర్మాణాలను నిషేధిస్తూ బఫర్ జోన్‌ను రూపొందించారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న శంషాబాద్, రాజేంద్రనగర్, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్ తదితర మండలాల్లోని 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాల భూమికి జీవో 111 వర్తిస్తుంది.

జీవో ప్రకారం.. రెసిడెన్షియల్ జోన్‌లలో అభివృద్ధికి అనుమతి ఉంది. కానీ వినియోగించే భూమిలో 90 శాతం కన్జర్వేషన్‌ కోసం కేటాయించాలి. పది శాతం మాత్రమే వినియోగించాలి. కన్జర్వేషన్‌ జోన్‌లో పూర్తిగా వ్యవసాయ భూములుగానే ఉండాలి. పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లోని అన్ని లేఅవుట్లలో మొత్తం విస్తీర్ణంలో.. 60 శాతం ఖాళీ స్థలంగా, రోడ్లుగా ఉంచాలి.

ఇక, కొంతకాలంగా నగరంలోని తాగు నీటి అవసరాల కోసం ఎక్కువగా.. కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తీసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం తాగునీటి కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లపై ఆధారపడే పరిస్థితులు లేవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

ఆ విషయంలో విమర్శలు..
నగరంలో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ బూమ్‌ను మరింతగా కొనసాగించేలా జివో 111ని రద్దు చేయాలనే స్థానికులు, రియల్టర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చినట్టుగా కేసీఆర్ ప్రభుత్వం చెబుతుంది. స్థానికుల కంటే రియల్ ఎస్టేట్ లాబీ నుండి వచ్చిన ఒత్తిడితోనే ప్రభుత్వం జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోందని యాక్టివిస్ట్ Lubna Sarwath అభిప్రాయపడ్డారు.

మరోవైపు.. మంత్రి కేటీఆర్ జీవో 111 నిబంధనలు ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్జీటీలో కేసు వేశారు. రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి మండలంలో కేటీఆర్ ఫాంహౌస్‌లో జీవో 111 ఉల్లంఘించారని ఆరోపించారు. అయితే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇక, ఇందుకు సంబంధించిన తీర్పును రిజర్వ్ చేసింది.