హైదరాబాద్‌: తెలంగాణలోని ఓ గ్రామంలో కుల వివక్ష బుసకొట్టింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం జల్దిపల్లిలో దళితులకు సాంఘిక బహిష్కరణ విధించారు. సర్పంచ్ కల్లు రవీందర్ కుల దురహంకారం ప్రదర్శించి దళిత కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ విధించారు. 

గ్రామ సర్పంచ్ కల్లు రవీందర్ కు, వార్డు సభ్యుడు పోతుగంటి పెద్ద సాయిలుకు మధ్య వివాదం కారణంగా దళిత కుటుంబాలు సాంఘిక బహిష్కరణకు గురయ్యాయి. సర్పంచ్ కల్లు రవీందర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి వచ్చే సరికి సాయిలు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. తనను చూసి కూడా లేచి నిలబడలేదు. దీంతో సర్పంచ్ కు చిర్రెత్తుకొచ్చింది. 

కల్లు రవీందర్ సాయిలుతో గొడవకు దిగాడు. దీంతో దళిత కుటుంబాలన్నీ సాయిలుకు మద్దతుగా నిలిచాయి. ఈ సంఘటన ఆదివారంనాడు చోటు చేసుకుంది. దాంతో దళిత కాలనీకి నీళ్లు సరఫరా చేయవద్దని, ఆ కాలనీలో డ్రైనేజీని శుభ్రం చేయవద్దని సర్పంచ్ గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. 

కామారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ అన్యోన నేతృత్వంలోని డిఎస్పీ సత్తెన్న, సిఐ సుధాకర్, ఎస్ఐ సుఖేందర్ రెడ్డి మంగళవారంనాడు గ్రామాన్ని సందర్శించడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. సర్పంచ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇదిలావుంటే, కుల వివక్ష పాటించిన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం జల్దిపల్లి గ్రామ సర్పంచ్‌ కల్లు రవీందర్‌ను టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరించాలని తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్య వేదిక (టీమాస్) ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కోరింది. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది. గ్రామ పంచాయతీ కార్యాలయలో దళిత యువకుడు కుర్చీలో కూర్చుంటే సహించలేని సర్పంచ్‌.. కులం పేరుతో దుర్భాషలాడటం బాధాకరమని వ్యాఖ్యానించింది. 

సర్పంచ్‌ తీరును నిలదీసిన పాపానికి 15 దళిత కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, ప్రజాప్రతినిధి పదవి నుంచి రవీందర్‌ను తొలగించాలని లేఖలో కోరింది.