Asianet News TeluguAsianet News Telugu

స్మగ్లింగ్ కింగ్, మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్: తెలంగాణ వీరప్పన్ అరెస్ట్

తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అటవీశాఖ అధికారుల కళ్లు గప్పి కలపను అక్రమంగా రవాణా చేస్తున్న తెలంగాణ వీరప్పన్ అలియాస్ ఎడ్ల శ్రీను అలియాస్ పోతారం శ్రీను ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు

telangana veerappan yedla srinu arrest in godavarikhani
Author
Godavarikhani, First Published Apr 10, 2019, 8:11 AM IST

తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అటవీశాఖ అధికారుల కళ్లు గప్పి కలపను అక్రమంగా రవాణా చేస్తున్న తెలంగాణ వీరప్పన్ అలియాస్ ఎడ్ల శ్రీను అలియాస్ పోతారం శ్రీను ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

వివరాల్లోకి వెళితే...పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారం గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీను 1999లో కలప అక్రమ రవాణా వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు. తొలుత సైకిళ్లతో రవాణా చేసే శ్రీను 20 ఏళ్ల కాలంలో ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు.

అటవీ ప్రాంతాలకు సమీపంలోని పల్లె ప్రజలకు డబ్బు ఆశ చూపి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లోని చెట్లను నరికి అక్రమ రవాణా చేసేవాడు.

ఇతనిపై మంథని, కోటపల్లి ప్రాంతాల్లోని పోలీస్, అటవీ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. కలప అక్రమ రవాణా వ్యాపారానికి గాను శ్రీను మూడు బృందాలను ఏర్పాటు చేశాడు. మొదటి బృందం చెట్లను నరుకుతుంది, రెండో  బృందం దుంగలను మైదాన ప్రాంతానికి తరలిస్తుంది.

మూడో బృందం కలపను పట్టణ ప్రాంతాలకు రవాణా చేస్తుంది. లక్షల రూపాయల ఈ వ్యాపారంలో సుమారు రెండు వేల మంది ఓ నెట్‌వర్క్‌గా ఏర్పడి పనిచేస్తున్నారు. కలప రవాణాకు ప్రైవేట్ ఎస్కార్ట్ బృందాలను ఏర్పాటు చేసి దుంగలను గమ్యస్థానాలకు చేర్చేవాడు.

శ్రీనుకు గ్రామ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేల వరకు.. అటవీశాఖ బేస్ క్యాంప్ వాచ్‌మెన్ నుంచి డీఎఫ్‌వో వరకు అందరి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. రాజకీయ ఒత్తిడితో పాటు లంచాలకు అలవాటు పడిన దాదాపు 20 మంది అటవీశాఖ అధికారులు ప్రత్యక్షంగా,  పరోక్షంగా శ్రీనుకు సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

దీంతో తెలంగాణ వీరప్పన్‌ను పట్టుకునేందుకు రామగుండం కమిషనరేట్ పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక మేటల కింద దాచిని కలపను డ్రోన్ కెమెరాల సాయంతో పట్టుకున్నారు.

పక్కా సమాచారంతో శ్రీను గ్యాంగ్‌ను గోదావరి ఖనిలో అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు కుడేదల కిషన్, కోరవేని మధుకర్, రాగం శ్రీనివాస్, ఎడ్ల సంతోష్‌లను అదుపులోకి తీసుకుని మరో 18 మందిపై కేసులు నమోదు చేశారు.

ముఠా సభ్యులు ఎక్కువగా గోదావరిఖనికి చెందిన సాయిరాం సామిల్స్, బాలాజీ సామిల్స్‌తో పాటు ప్రకాశం జిల్లా ఎర్రగుంట పాలెంకు చెందిన శనిగ నారాయణరెడ్డి సామిల్స్‌కు కలపను స్మగ్లింగ్ చేసేవారని దర్యాప్తులో తేలింది. నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios