హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన కొత్త పంచాయితీరాజ్ చట్టం వెలుగులో పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గ్రామపంచాయితీ నుంచి జిల్లా పరిషత్ ల వరకు ఎవరు ఏ విధులు నిర్వహించాలనే విషయంలో త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు. 

శనివారం పంచాయతీరాజ్‌శాఖపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. గ్రామాలు బాగుపడాలన్న లక్ష్యంతోనే కొత్త పంచాయితీరాజ్ చట్టాన్ని తెచ్చామని తెలిపారు. పల్లెల రూపురేఖలు మార్చడానికి కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు.  

పంచాయితీరాజ్ వ్యవస్థలో స్థానిక ప్రజాప్రతినిధులు పాలనలో భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు. త్వరలోనే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు వస్తాయని  స్పష్టం చేశారు. తెలిపారు.  

గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలవడానికి ముందే స్థానిక సంస్థలకు అప్పగించే విధులు, నిధులు, బాధ్యతల విషయంలో స్పష్టత ఇస్తామని వెల్లడించారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి గ్రీన్ కమిటీని నియమిస్తున్నట్లు వెల్లడించారు.  

జిల్లా పరిషత్ లు, మండల పరిషత్ లు ఇప్పటి మాదిరిగా ఏ పనీ లేకుండా ఉత్సవ విగ్రహాలుగా ఉండబోరని, అధికార వికేంద్రీకరణ ద్వారా వారికి విధులు, నిధులు బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తామని స్పష్టం చేశారు కేసీఆర్.