హైదరాబాద్: తెలంగాణలోని ఆర్టీసీ ఉద్యోగులకు ఇంతవరకు వేతనాలు అందలేదు. సమ్మెతో పాటు కరోనా లాక్ డౌన్ ప్రభావం ఆర్టీసీపై పడింది. దీంతో జనవరి నెల వేతనాలు ఉద్యోగులకు ఇంకా అందలేదు. వేతనాల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.

కరోనా కారణంగా 2020 మార్చి 22 నుండి మే 19వ తేదీ వరకు ఆర్టీసీ బస్సులను నడపలేదు. దీంతో ఆయా డిపోల్లోనే 10 వేల బస్సులు నిలిచిపోయాయి.  గత ఏడాది మే 19వ తేదీనుండి జిల్లాల్లో బస్సు సర్వీసులను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.

గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ నుండి సిటీ బస్సులను నడుపుతున్నారు. కరోనా లాక్‌డౌన్ కు ముందు ప్రతి రోజూ ఆర్టీసీకి రూ. 12 కోట్ల ఆదాయం వచ్చేది, లాక్ డౌన్ తర్వాత రోజూ కనీసం రూ. 2 కోట్ల ఆదాయం కూడ రావడం లేదు. ప్రతి నెల జీతాల కోసం రూ. 140 కోట్లు చెల్లించాలి. గత ఏడాది ఆగష్టు మాసంలో రూ. 600 కోట్ల లోన్ అమౌంట్ ను  ఉద్యోగుల జీతాల కోసం ఆర్టీసీ యాజమాన్యం మళ్లించింది.

గత ఏడాది నవంబర్ 15వ తేదీన పెండింగ్ లో ఉన్న రెండు మాసాల వేతనాలను చెల్లించాలని సీఎం కేసీఆర్  ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. ఈ ఆదేశాలతో రెండు మాసాల వేతనాలు చెల్లించారు.

ప్రతి నెల ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో ఆలస్యమౌతోంది. ఈ నెల ఇంతవరకు వేతనాలు చెల్లించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వేతనాలు రాకపోవడంతో ఇంటి అద్దెతో పాటు ఈఎంఐలు చెల్లించేందుకు ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.