ఉపవాస దీక్షా వేదిక వద్దకు భారీగా పోలీసులు.. కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసే ఛాన్స్.?
కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 24 గంటల ఉపవాస దీక్షకు కూర్చొన్న సంగతి తెలిసిందే . సాయంత్రం 6 గంటల వరకే దీక్షకు అనుమతి వుండటంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.

కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 24 గంటల ఉపవాస దీక్షకు కూర్చొన్న సంగతి తెలిసిందే. ఈ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. రేపటి వరకు దీక్ష చేస్తానని కిషన్ రెడ్డి చెబుతుండగా.. సాయంత్రం 6 గంటల వరకే అనుమతి వుందని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ క్రమంలో దీక్ష వేదిక చుట్టూ మోహరించిన పోలీసులు .. కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే దీక్షను భగ్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ఇబ్బంది ఏంటని ఆయన పోలీసులను ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన దీక్షను కొనసాగిస్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
అంతకుముందు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతివ్వొద్దనీ, బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొస్తే ప్రజలు పేదలుగా మారతారనీ, అవినీతి మరింతగా పెరుగుతుందని కిషన్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తమ కుటుంబం తప్ప మరెవరినీ బీఆర్ఎస్ అధ్యక్షునిగా చేయనివ్వరు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఏ రాష్ట్రానికైనా ప్రధాని కావాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా అది బీజేపీ పాలనలోనే సాధ్యమని కిషన్ రెడ్డి అన్నారు.
ALso Read: కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది: కిషన్ రెడ్డి
కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల గురించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ కు ఓటు వేయడం బీఆర్ ఎస్, ఎంఐఎం పార్టీలకు ఓటు వేసినట్లేనని అన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు ఓటేసినట్లేనన్నారు. 'మీరు తీసుకునే ఎంపికల గురించి తెలుసుకోండి. ఈసారి మీకు సేవ చేసేందుకు బీజేపీకి అవకాశం ఇవ్వండి' అని కిషన్ కోరారు.
జాతీయస్థాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఇతర పార్టీలు సహకరిస్తే ఎన్నికల ఖర్చులన్నీ తానే భరిస్తానని కేసీఆర్ చెప్పారన్నారు. ఇతర పార్టీలకు నిధులు ఇవ్వడానికి ఆయనకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?' అని బీజేపీ నేత ప్రశ్నించారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల ఊబిలోకి నెట్టిందనీ, ఆ పార్టీ నేతలు అవినీతిలో కూరుకుపోయారనీ, ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ భూములను అమ్మి ఓఆర్ఆర్ ను 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకుని జీతాలు ఇస్తున్నారన్నారు.