తెలంగాణలో పాలిటెక్నిక్‌ ప్రశ్నా పత్రాలు లీక్‌ (Polytechnic question paper leak) వ్యవహారం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును పోలీసులు మరింత ముమ్మురం చేశారు 

తెలంగాణలో పాలిటెక్నిక్‌ ప్రశ్నా పత్రాలు లీక్‌ (Polytechnic question paper leak) వ్యవహారం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పాలిటెక్నిక్ ఫైనలియర్ పేపర్ లీకేజీ కావడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్న పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మురం చేశారు. ఈ కేసుకు సంబంధించి రాచకొండ పోలీసులు (Rachakonda Police) ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో స్వాతి కాలేజ్‌కు చెందిన ముగ్గురు సిబ్బందితో పాటు అబ్జర్వర్ ఉన్నారు. 

వివరాలు.. పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రాల లీక్‌ను గుర్తించిన వివిధ జిల్లాల్లోని ప్రిన్సిపల్స్‌ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్​ శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​మండలం బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్‌ నుంచి పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ ప్రశ్నాపత్రాలు లీకయినట్లు అధికారులు గుర్తించారు. వాట్పాప్‌ ద్వారా స్వాతి కాలేజ్‌ ఉద్యోగులు పేపర్ లీక్ చేశారు. ఈ కేసుకు సంబంధించి అబ్జర్వర్‌ను పాలిటెక్నిక్ బోర్డు ఇప్పటికే సస్పెండ్ చేసింది.

పాలిటెక్నిక్ పరీక్షా పేపర్ల లీకేజ్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో జరిగిన పరీక్షలను రద్దు చేసింది. రద్దయిన పరీక్షలను ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది.