హైదరాబాద్: రాష్ట్రంలో కల్పించిన ఉద్యోగాలపై కాంగ్రెసు నేత దాసోజు శ్రవణ్ చేసిన విమర్శలను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తిప్పికొట్టారు. ఎవడో గొట్టంగాడు రమ్మంటే కేటీఆర్ వస్తారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కల్పించిన ఉద్యోగాలపై చర్చకు రావాలని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్ హైదరాబాదులోని గన్ పార్కు వద్ద వద్ద దాసోజు శ్రవణ్ బైఠాయించిన విషయం తెలిసిందే. దాన్ని ప్రస్తావిస్తూ తలసాని శ్రీనివాస్ ఆ ప్రశ్న వేశారు. 

గత ప్రభుత్వాలు కల్పించలేని ఉద్యోగాలను తమ టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందని ఆయన అన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాగ్రత్తగా పనిచేయాలని ఆయన అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అతి విశ్వాసం కూడదని ఆయన టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. 

ఎవడు పడితేవాడు గన్ వార్కు వద్దకు రమ్మంటే కేటీఆర్ వస్తారా అని ఆయన అన్నారు. చర్చకు రావాలని అడగడానికి స్థాయి ఉండాలని ఆయన అన్నారు. రెండేళ్లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారని ఆయన అడిగారు. 

ఇదిలావుంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దుబ్బాకలో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చేప్పారని ఆయన అన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందని, అయినా ప్రజలు ఎవరికి ఓటు వేయాలో వారికే వేశారని ఆయన అన్నారు. 

తాము పేదల కోసం పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన అన్నారు. పేదల కోసం తమ కార్యకర్తలు లాఠీదెబ్బలు తిన్నారని ఆయన అన్నారు.