బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాయలసీమ గుండాయిజానికి తావు లేదన్నారు .

ఇక్కడ గుండాయిజం చేస్తే పోలీసులు ఊరుకోరని ఆయన స్పష్టం చేశారు. రాత్రి రాయలసీమ నుంచి వచ్చిన కొందరు గుండాయిజం చేసేందుకు యత్నించారని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ముగ్గురిని కిడ్నాప్ చేశారని... పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కిడ్నాపర్ల ఆటకట్టించారని మంత్రి తెలిపారు. 

కాగా, బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్  పాత్ర ఉందని తేలిందని  హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు.

Also Read:బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా దంపతులదే కీలకపాత్ర: హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్

బుధవారం నాడు సాయంత్రం తన కార్యాలయంలో ఆయన బోయిన్‌పల్లి కిడ్నాప్ నకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ కేసులో భూమా అఖిప్రియ దంపతులతో పాటు మరికొందరి ప్రమేయం కూడా ఉందన్నారు.

ఆదాయ పన్ను శాఖాధికారుల మాదిరిగా నకిలీ గుర్తింపు కార్డులను  ఉపయోగించారని ఆయన చెప్పారు. కిడ్నాపర్లు ఉపయోగించిన కార్లకు నకిలీ నెంబర్ ప్లేట్లను ఉపయోగించారని చెప్పారు.  

15 బృందాలుగా గాలించి కిడ్నాపర్లను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసులో  ఏ-1 ఏవీ సుబ్బారెడ్డి, ఏ-2 గా భూమా అఖిలప్రియ, ఏ-3 గా  భార్గవ్ రామ్ ను చేర్చామని సీపీ వివరించారు.