కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా భారతదేశం లాక్ డౌన్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ లాక్ డౌన్ నియమాలను కొన్నిసార్లు ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే తుంగలో తొక్కుతున్నారు. 

తాజాగా తెలంగాణ ఎక్సయిజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇలా లాక్ డౌన్ నియమాలను తుంగలో తొక్కుతూ తన సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ ను ప్రారంభించారు. 

మహబూబ్ నగర్ పట్టణంలోని రవీంద్ర నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన జిమ్ ను ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటుగా పోలీసులుకూడా వచ్చారు. వారే అక్కడి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు కూడా. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రజలు సోషల్ డిస్టెంసింగ్ నియమాలను పాటించకుండా లాక్ డౌన్ ను సాక్షాత్తు అందరూ ప్రభుత్వ అధికారులు, మంత్రి ముందే ఉల్లంఘించారు. 

తన మంది మార్బలంతో జిమ్ ను ప్రారంభించడమే కాకుండా ఆయన అక్కడ ఉన్న పరికరాలను పట్టుకొని ఫోటోలకు ఫోజులు కూడా ఇవ్వడం గమనార్హం. స్థానిక పోలీసుల నుంచి ఈ కార్యక్రమానికి ముందస్తు అనుమతి లేకున్నప్పటికీ... స్వయానా అమాత్యులే ప్రారంభోత్సవం చేస్తుండడంతో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసారు. 

జిమ్  ఓనర్ మాత్రం ప్రారంభం నేడు అయినప్పటికీ... ప్రజలకు మాత్రం లాక్ డౌన్ తరువాత మాత్రమే అందుబాటులో ఉంటుందని, కేవలం మంత్రి గారు నియోజకవర్గంలో ఉన్నందున మాత్రమే ఇలా ప్రారంభిత్సవం చేపించినట్టు తెలిపారు. 

తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. రెండు నెలల చిన్నారికి కరోనా వైరస్ సోకినట్లు నీలోఫర్ వైద్యులు నిర్ధారించారు. దీంతో చిన్నారి కుటుంబానికి చెందిన ఆరుగురిని క్వారంటైన్ కు పంపించారు. 

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర రాజధాని ముషీరాబాద్ ప్రాంతంలో ఓ మిల్క్ బూత్ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పరీక్షల్లో అతని సోదరికి కూడా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. అంతేకాకుండా వాళ్లు నివాసం ఉంటున్న ఆపార్టుమెంట్ వాచ్ మన్ ఐదేళెల కుమారుడికి కూడా పాజిటివ్ వచ్చింది.

దాంతో మిల్క్ బూత్ వ్యక్తికి చెందిన 16 మందిని క్వారంటైన్ కు తరలిం్చారు. దానికితోడు, ఆపార్టుమెంటులో నివాసం ఉంటున్న 40 మందిని క్వారంటైన్ కు తరలించారు. అతని వద్ద పాలు కొనుగోలు చేసిన వ్యక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. 

కాగా, హైదరాబాదులోని నేరేడుమెట్ మధురానగర్ లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతని కుటుంబం మొత్తాన్ని అధికారులు క్వారంటైన్ కు తరలించారు. ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం అన్నదానం చేయడమే కాకుండా నిత్యావసర సరుకులు పంపిణీ చేశాడు. దాంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపు 50 మంది ఇందులో పాల్గొన్నారు.

ఇదిలావుంటే, తెలంగాణలో ఇప్పటి వరకు 766 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 18 మంది కోవిడ్ -19 వ్యాధితో మరణించారు. హైదరాబాదులో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది.