హైదరాబాద్: తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకునేందుకు భిక్షాటన చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ. ఇంటర్ ఫలితాల అవకతవకల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. 

ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని తాము ప్రభుత్వాన్ని ఎంతలా డిమాండ్ చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వంలో కదలికలు లేకపోవడంతో తాము భిక్షాటన చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

అందులో భాగంగా ఛార్మినార్ నుంచి నాంపల్లి వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో భిక్షాటన చేపట్టారు టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిలు.  

విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోదని అందువల్లే తాము భిక్షాటన చేస్తున్నట్లు నేతలు తెలిపారు. అయితే పోలీసులు వారి భిక్షాటనను అడ్డుకున్నారు. భిక్షాటన చేసి ఆదుకుందామంటే అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణాలకు కారకులైన బోర్డు కార్యదర్శి అశోక్, గ్లోబరినాపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని నేతలు విమర్శించారు.