Asianet News TeluguAsianet News Telugu

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న శాసన మండలి చైర్మన్ గుత్తా, ఆయన సతీమణి

శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కరోనా టీకా వేయించుకున్నారు. ఆయన సతీమణి అరుంధతి కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

Telangana Legislative Council chairman Gutta Sukhender Reddy takes Corona vaccine
Author
Hyderabad, First Published Mar 3, 2021, 2:49 PM IST

హైదరాబాద్. శాసనమండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారంనాడు కరోనా వైరస్ టీకా తీసుకున్నారు. ఆయన సతమీణి అరుంధతి కూడా కరోనా టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించిందని చెప్పారు.

కరోనా వైరస్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, వైరస్ ని కట్టడిచేసుందుకు హైదరాబాద్ పట్టణంలో భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ టీకాను కనుక్కోవడం మనందరికి గర్వకారణమని ఆయన అన్నారు. 

కరోన వారియర్స్ అయిన వైద్య సిబ్బంది,ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులకు మొదటగా టీకాలు వేసినందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ రోజు తాను, తన సతీమణి, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, ఆయన సతీమణి అందరం కోవాక్సిన్ టీకా తీసుకున్నామని చెప్పారు.  వ్యాక్సిన్ వచ్చింది కదా అని కరోన వైరస్ ని నిర్లక్ష్యం చేయవద్దని ఆయన సూచించారు. వైరస్ మళ్ళీ విజృంభిస్తుందని, గతంలో ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడు అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని గుత్తా అన్నారు.

కరోన వైరస్ మూడో దశ మళ్ళీ ప్రారంభం అయ్యిందని, అయిదు రాష్ట్రాల్లో మళ్ళీ కరోన కేసులు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు.  మహారాష్ట్ర తో పాటు కొన్ని రాష్ట్రాల్లో మళ్ళీ లాక్ డౌన్ విధించాల్సిన పరిస్తితి ఏర్పడిందని అన్నారు..  ప్రజలు తప్పకుండ మాస్క్ లు ధరించి, శానిటైజర్ లు వాడాలని సూచించారు. 

మన దేశవ్యాప్తంగా ఇప్పటికి 2 లక్షల మంది కరోన కారణంగా మరణించారని, .మన రాష్ట్రంలో 7 వేల మంది కరోన మహమ్మారి కారణంగా మరణించారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు కారణంగా ఎప్పటికి అప్పుడు తగు చర్యలు తీసుకోవడం వలన మన రాష్ట్రంలో మరణాల సంఖ్య తగ్గిందని ఆయన అన్నారు.

కష్ట కాలంలో ప్రజలకు సేవ చేసిన కరోన వారియర్స్ కి ఆయన ప్రత్యేక ధన్యవాదాలుతెలిపారు. మరి ముఖ్యంగా పాత్రికేయులకు ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు. కరోన వైరస్ పేరు చెబితేనే గడగడవణుకుతున్న రోజుల్లో మీడియా సోదరులందరు తమ ప్రాణాలను లెక్కచేయకుండా  వార్తలు సేకరించారని అన్నారు.

రానున్న బడ్జెట్ సమావేశాలు జరిగేలోపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నామని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనేది తప్పుడు సమాచారమని అన్నారు.కరోన వ్యాక్సిన్ వేసుకోవడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. 

నిమ్స్ డైరెక్టర్ డా. మనోహర్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, నిజామాబాద్ డీసీసీబి చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు సభాపతి, చైర్మన్ వెంట ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios