హైదరాబాద్: హైద్రాబాద్‌లో ఉన్న ఏపీ ప్రభుత్వానికి చెందిన భవనాలను వీలైనంత త్వరగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని  తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ ప్రభుత్వ ఆధీనంలోని భవనాలు తమ చేతుల్లోకి వస్తే కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ సచివాలయం ఆవరణలోనే ఏపీ ప్రభుత్వానికి నాలుగు బ్లాకులను కేటాయించారు. హెచ్, జే, కె, ఎల్ బ్లాకులను ఏపీకి రాష్ట్ర విభజన సమయంలో కేటాయించారు. ఏ,బీ, సీ, డీ బ్లాకులు తెలంగాణ ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి.

అవశేష ఆంధ్రప్రదేశ్‌కు తొలి సీఎంగా చంద్రబాబునాయుడు కొంతకాలంపాటు హైద్రాబాద్ కేంద్రంగా పాలన సాగించాడు. ఈ సమయంలో హెచ్, జే, కె, ఎల్ బ్లాకులను ఉపయోగించారు. అయితే ఆ తర్వాత చంద్రబాబునాయుడు తన పాలనను ఏపీ నుండి సాగించారు. ఇక్కడ ఉన్న ఏపీ భవనాల్లో సామాగ్రిని తీసుకెళ్లారు. అమరావతిలో తాత్కాలికంగా కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని పాలన సాగిస్తున్నారు.

2019లో వైఎస్ జగన్  ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. హైద్రాబాద్‌లోని ఏపీ సచివాలయ భవనాలను తెలంగాణకు ఇచ్చేందుకు జగన్ ఒప్పుకొన్నారు. దీంతో ఏపీ ప్రభుత్వానికి కేటాయించిన ఈ నాలుగు బ్లాకులను తెలంగాణ ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తోంది.

ఈ విషయమై ఏపీకి చెందిన ఐఎఎస్ అధికారి ప్రేమ్ చంద్రారెడ్డి తెలంగాణ ఐఎఎస్ అధికారి రామకృష్ణారావులు  సోమవారం నాడు తెలంగాణ సచివాలయంలో భేటీ అయ్యారు. ఏపీ భవనాల అప్పగింతపై చర్చించారు. 

ఈ నాలుగు బ్లాకుల్లోని  మెటీరియల్‌ను ఏపీకి త్వరగా తరలించి.... తమకు భవనాలను  అప్పగించాలని  తెలంగాణ ప్రభుత్వం కోరింది. హైద్రాబాద్‌‌లోని  మంత్రుల క్వార్టర్లను కూడ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని కూడ తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.

ఏపీకి చెందిన కొందరు మంత్రులకు మంత్రుల క్వార్టర్స్ లో భవనాలు ఉన్నాయి. వాటిని వెంటనే ఖాళీ చేసి ఎస్టేట్ ఆఫీసర్స్ అప్పగించాలని కోరారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని  భవనాలను కూడ తమకు అప్పగించాలని కోరారు.

తెలంగాణకు కొత్త సచివాలయాన్ని నిర్మించాలని  కేసీఆర్ భావిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న సచివాలయం వాస్తు రీత్యా దోషం ఉందని భావిస్తున్నాడు. దీనికి తోడు అన్ని హెచ్ ఓ డి కార్యాలయాలతో పాటు మంత్రుల చాంబర్లు కూడ ఒకే దగ్గర ఉండేలా సచివాలయం ఉండాలని కేసీఆర్ భావన. 

ఏపీకి చెందిన భవనాలను అప్పగించేందుకు జగన్  అంగీకరించిన నేపథ్యంలో  ఈ నాలుగు బ్లాకును వెంటనే తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని  కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. ఈ నెల 27వ తేదీ లోపుగా కొత్త సచివాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాలని కేసీఆర్ యోచిస్తున్నాడు.

సచివాలయ నిర్మాణ పనులు జరిగే సమయంలో  బూర్గుల రామకృష్ణారావు భవనం లేదా... ఆయా హెచ్ ఓ డీ కార్యాలయాల్లో  ఆయా శాఖల కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉంది.