తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పోలీస్ శాఖ ఎంతో మెరుగుపడిందని నూతన హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. నిత్యం పని ఒత్తిడితో విధులు నిర్వహించే పోలీసులకు వీక్ ఆఫ్ ఇచ్చే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. డిజిపి మహేందర్ రెడ్డితో చర్చించిన తర్వాత ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు మహమూద్ అలీ వెల్లడించారు. 

తెలంగాణ హోంమంత్రిగా ఇవాళ సెక్రటేరియట్ లో మహమూద్ అలీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు, పోలీస్  ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందనలు తెలిపారు. మాజీ హోమంత్రి నాయిని నర్సింహరెడ్డి, సినిమాటోగ్రపి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిజిపి మహేందర్ రెడ్డి తో పాటు పలువురు నాయకులు హోమంత్రిని మహమూద్ అలీని కలిశారు. 

హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మహమూద్ అలీ మాట్లాడుతూ...రెండవసారి కూడా తనపై నమ్మకంతో మంత్రివర్గంలో  అవకాశం కల్పించిన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. మొదటిసారి డిప్యూటీ సీఎంగా... రెండవసారి హోమ్ మంత్రి గా పనిచేసే అవకాశం తనకు దక్కడం అదృష్టమన్నారు.  దేశంలోనే నంబర్ వన్ లీడర్ కేసీఆర్ మంత్రవర్గంలో బాధ్యతాయుతంగా తన విధులు నిర్వర్తిస్తానని మహమూద్ అలీ వెల్లడించారు. 

తెలంగాణ బడ్జెట్‌లో మైనారిటీ లకు 2వేల కోట్లు కేటాయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని హోమంత్రి అన్నారు. దీని ద్వారా తెలంగాణ లో 65 లక్షల మంది ముస్లింలకు న్యాయం జరిగిందని తెలిపారు. తాను రెవెన్యూ మంత్రిగా సమర్ధవంతంగా పనిచేశానని...కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ తాను మంత్రిగా వున్న సమయంలోనే జరిగిందని గుర్తుచేశారు. 

ఇండియాలో తెలంగాణ పోలీసులకు మంచి పేరు ఉందని మహమూద్ అలీ  కొనియాడారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా తెలంగాన పోలీసుల పనితీరును అభినందించారని గుర్తుచేశారు.శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తూ క్రైమ్ రేట్ ఇంకా తగ్గించడానికి ప్రయత్నిస్తామని హోమంత్రి వెల్లడించారు.

వీడియో

"