హైదరాబాద్:  ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో  ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కేసులో తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. మంగళవారం ఇరు వర్గాల వాదనలను ధర్మాసనం వింది.

రవిప్రకాష్ తరపున  దిల్‌‌జిత్ సింగ్ అహువాల్యా వాదించారు.  టీవీ9 షేర్ల అగ్రిమెంట్  కుట్ర పూర్వకంగా జరిగిందిన ఆయన వాదించారు. రవిప్రకాష్ 40వేల షేర్లను సినీ నటుడు శివాజీకి విక్రయించిన విషయం వాస్తవమని  ఆయన కోర్టుకు చెప్పారు. టీవీ9 లోగో రవిప్రకాష్‌కే చెందుతోందన్నారు.  ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలను విన్పించారు. టీవీ9 షేర్ల కొనుగోలు నిబంధలన ప్రకారమే జరిగిందన్నారు.

ఈ మేరకు జరిగిన అగ్రిమెంట్ పేపర్లను ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. టీవీ9 లోగో ఒక వ్యక్తి ప్రాపర్టీ కాదన్నారు. అది కంపెనీ ప్రాపర్టీగా ఉంటుందన్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఎలాంటి  కేసు పెండింగ్ లేదన్నారు. మరో వైపు  రవిప్రకాష్, శివాజీలకు సంబంధించిన పిటిషన్‌పై నేషనల్ కంపెనీ అప్లియేట్ లా ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందని కూడ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసు విషయమై  ఇరు వర్గాల వాదనలను విన్న కోర్టు... తీర్పును మాత్రం రిజర్వులో ఉంచింది.