కవితపై చర్యలకు తెలంగాణ హైకోర్టులో ధర్మపురి అరవింద్ పిటిషన్: కొట్టేసిన హైకోర్టు
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఒకే నేరంపై రెండో ఎఫ్ఐఆర్ అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది.
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారని హైకోర్టకు అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఒకే నేరంపై రెండో ఎఫ్ఐఆర్ అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది.
కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఈ నెల 17న మీడియా సమావేశంలో చెప్పారు. ఎఐసీసీ సెక్రటరీ ఈ విషయం తనకు చెప్పారన్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు ఖర్గేతో కవిత మాట్లాడారని అరవింద్ చెప్పారు.ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు ఎంపీ అరవింద్ ఇంటిపై దాడికి దిగారు. ఈ దాడిపై ఎమ్మెల్సీ కవితపై చర్యలకు డిమాండ్ చేస్తూ అరవింద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తనపై తప్పుడు ప్రచారం చేస్తే ఎంపీ అరవింద్ ను చెప్పుతో కొడతానని ఎమ్మెల్సీ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అరవింద్ ఎక్కడినుండి పోటీ చేసినా ఓడిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో కవిత నిజామాబాద్ నుండి పోటీ చేస్తే తాను సిద్దంగా ఉన్నానని అరవింద్ కూడ చెప్పారు. తన ఇంటిపై దాడి చేసి తన తల్లిని బెదిరించారని టీఆర్ఎస్ పై ఎంపీ అరవింద్ మండిపడ్డారు. 2014లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా కవిత విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మళ్లీ అదే స్థానం నుండి ఆమె పోటీ చేసి బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. కవితకు కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు.