కరోనా సెకండ్ వేవ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. శనివారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కోవిడ్‌ ఫస్ట్ వేవ్‌తో ప్రమాదం ఏమీ లేదు.. కానీ, సెకండ్ వేవ్ ప్రమాదకరమైనదని ఆయన హెచ్చరించారు.

ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈటల స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇతర దేశాల నుండి వచ్చిన వారిని ట్రెస్ చేయగా కొంతమందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మంత్రి తెలిపారు.

అయితే, అది కొత్త స్ట్రెయిన్ కరోనా? లేక పాత కరోనా? అనేది నిర్దారణ కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ప్రమాదంగానే ఉందని హెచ్చరించిన రాజేందర్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, ఈ నెలలో యూకే నుంచి, యూకే మీదుగా 1200 మంది తెలంగాణకి వచ్చినట్టు తేల్చిన అధికారులు.. అందరినీ గుర్తించేపనిలో పడ్డారు. వీరిలో ఇప్పటికే కొంత మందికి పాజిటివ్‌గా తేలింది.

అలాగే వారితో సన్నిహితంగా ఉన్నవాళ్లను కూడా హోం క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. పాజిటివ్‌గా తేలినవారి నమూనాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించి స్ట్రెయిన్ 70నా కాదా.. అని తేల్చే పనిలో పడ్డారు.