హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ ఆదేశాలు జారీ చేసింది.

సరిహద్దు రాష్ట్రాల ప్రజలను కట్టడి చేసే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఆ ఉత్తర్వులు జారీ చేసింది. సరిహద్దులోని ప్రాంతాల ప్రజలు వైద్యం, ఇతర అత్యవసర పనుల కోసం ఏపీ, మహారాష్ట్రల్లోకి వెళ్లడానికి వీలు లేదని ప్రకటించింది. 

దాన్ని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పోలీసు బలగాలను పెంచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు విస్తృతంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు అక్కడికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. 

అదే సమయంలో ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజలు విజయవాడ, గుంటూరుల వైపు వెళ్లకుండా నిషేధం విధించింది. అదే సమయంలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు మహారాష్ట్రకు వెళ్లకుండా కట్టడి చేసింది. తెలంగాణలో కేసులు తగ్గినట్లే తగ్గి గురువారం పెరిగిన విషయం తెలిసిందే.