Asianet News TeluguAsianet News Telugu

కొత్త యాప్, ప్రత్యేక వాహనాలు.. కరోనాపై పోరులో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు

రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రతరమవుతూ ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు గాను పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనాపై పోరుకు గాను కొత్త యాప్ రూపకల్పన చేసింది. యాప్ ద్వారానే కాంటాక్ట్ పర్సన్‌కు ఎస్ఎంఎస్ పంపనుంది. 

telangana govt key decisions on fight against coronavirus ksp
Author
Hyderabad, First Published Apr 3, 2021, 8:08 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రతరమవుతూ ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు గాను పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనాపై పోరుకు గాను కొత్త యాప్ రూపకల్పన చేసింది.

యాప్ ద్వారానే కాంటాక్ట్ పర్సన్‌కు ఎస్ఎంఎస్ పంపనుంది. రాష్ట్రంలోని 22 ఆసుపత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేసింది. దీనితో పాటు తెలంగాణలో కరోనా కాల్ సెంటర్లను పునరుద్దరించాలని నిర్ణయించింది.

అలాగే కోవిడ్ పేషెంట్ల తరలింపు కోసం ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సను అందించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కరోనాను ప్రైవేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకోవద్దని.. ప్రభుత్వం నిర్థారించిన రేట్లకే వైద్యం అందించాలని మంత్రి సూచించారు. 

అంతకుముందు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో క్వారంటైన్ సెంటర్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లో క్వారంటైన్ సెంటర్‌ను సందర్శించారు కలెక్టర్ శ్వేతా మహంతి. అలాగే క్వారంటైన్ సెంటర్లు తిరిగి ప్రారంభించాలని కలెక్టర్లను ఆదేశించింది. 

మరోవైపు తెలంగాణపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కరోనా కేసులు వెయ్యి దాటాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1078 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

వైరస్‌ కారణంగా ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1712కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ శనివారం బులెటిన్ విడుదల చేసింది.

తాజాగా 331 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం 6900 యాక్టివ్‌ కేసులు రాష్ట్రంలో ఉన్నాయని, 3,116 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 283 ఉన్నాయి. శుక్రవారం 59,705 కొవిడ్‌ టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios