హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వం పట్ల అసహనం రగులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఐఆర్ ఇవ్వలేమని, పీఆర్సీ మాత్రం ఇస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు స్వయంగా ప్రకటించారు. దీన్నిబట్టి ఐఆర్ కు కేసీఆర్ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చినట్లేనని భావించాల్సి ఉంటుంది. అయితే, పిఆర్సీకి కూడా అతీగతీ లేదని ఉద్యోగులు రగిలిపోతున్నారు. 

ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు కూడా నిస్సహాయ స్థితిలో పడ్డారని ఉద్యోగులు మండిపడుతున్నారు. టీఎస్ఆర్టీసి కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో మిగతా ఉద్యోగుల పరిస్థితి ఏమిటనే చర్చ కూడా ప్రారంభమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డిఎ (డియర్నెస్ అలవెన్స్) కోసం కూడా ఉద్యోగాలు నానా తంటాలు పడాల్సి వస్తోంది. 

గత నాలుగేళ్లుగా ఒక్కోసారి రెండు డిఎలు, మరోసారి 3 డీఎలు పెండింగ్ లో ఉంటున్నాయి. అటు చూస్తే కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రబుత్వం వెంటనే 27 శాతం ఐఆర్ ప్రకటించింది. వీలైనంత త్వరగా పీఆర్సీ ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతోంది. ఇక్కడ తెలంగాణలో మాత్రం కేసీఆర్ ప్రకటనలతోనే సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

2018 జులై నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉండింది. కానీ ఇప్పుటి వరకు దానికి అతీగతీ లేదు. పీఆర్సీ కమిటీ వేస్తున్నట్లు కేసీఆర్ 2018 మేలో ప్రకటించారు. కానీ అది అమలుకు నోచుకోలేదు. 2018 జూన్ నుంచి ఐఆర్ ఇస్తామని, 2019లో పీఆర్సీ అమలు చేయిస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. కానీ అది జరగలేదు. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ విషయంపై కేసీఆర్ ప్రకటన చేస్తారని ఉద్యోగులు ఎదురు చూశారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. 

ఉపాధ్యాయ సంఘాలు ఆగస్టులో ధర్నాలు, రిలే నిరాహారదీక్షలు, పాదయాత్రలు వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినా ఫలితం కనిపించలేదు. దానికితోడు ప్రభుత్వం నుంచి బెదిరింపులు కూడా వచ్చాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఐఆర్ ఇవ్వబోమని, పీఆర్సీ తప్పక ఇస్తామని హరీష్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఆ ప్రకటన అమలుకు నోచుకోవడం లేదు. పైగా అసెంబ్లీ వేదికగా ఉద్యోగులను కుక్త తోకతో పోలుస్తూ కేసీఆర్ మాట్లాడారు. క్రమం తప్పకుండా ఎన్నికలు వస్తున్న క్రమంలో ఎన్నికల కోడ్ ను చూపిస్తూ తెలంగాణ ప్రభుత్వం దాటవేస్తూ వస్తోందని అంటున్నారు.