వెలిగొండ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు విషయంలో పునరాలోచన చేయాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విన్నవించింది. నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టుకు నిధులు ఎలా కేటాయిస్తారని కూడా ప్రశ్నించింది.


హైదరాబాద్: వెలిగొండ ప్రాజెక్టుకు ఏఐబీపీ నిధులు కేటాయింపుపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగా ప్రభుత్వం లేఖ రాసింది. శుక్రవారం నాడు తెలంగాణ సర్కార్ ఈ లేఖను కేంద్రానికి పంపింది.వెలిగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని తెలంగాణ ప్రభుత్వం ఆ లేఖలో పేర్కొంది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన గెజిట్ లో కూడ ఈ ప్రాజెక్టును నోటిఫై చేయలేదని కూడ తెలంగాణ సర్కార్ గుర్తు చేసింది. అనుమతి లేని ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడం సరైంది కాదని కూడ తెలంగాణ సర్కార్ అభిప్రాయపడింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొంత కాలంగా జల జగడం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కల్వకుర్తి లిప్ట్ విస్తరణతో పాటు పాటు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టు భక్త రామదాసు తదితర ప్రాజెక్టులపై కూడ ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

రెండు రాష్ట్రాలు కూడ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయని పరస్పరం ఫిర్యాదు చేసుకొన్నాయి. నీటి కేటాయింపుల విషయంలో కూడ రెండు రాష్ట్రాలు రెండు రకాలుగా వాదిస్తున్నాయి. 70:30 నిష్పత్తిలోనే నీటి పంపకాలు జరగాలని ఏపీ వాదిస్తోంది. తెలంగాణ మాత్రం 50:50 నిష్పత్తిలో నీటి వాటాల కేటాయింపులు జరగాలని పట్టుబడుతోంది.ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది.