తెలంగాణాలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఢిల్లీ నుంచివిదేశాల నుంచి వచ్చిన వారందరిని దాదాపుగా ట్రేస్ చేసి వారిని, వారు కలుసుకున్నవారిని క్వారంటైన్ కి తరలించినప్పటికీ.... ఇంకా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం కేసులను గుర్తించడానికి చేయగలిగినదంతా చేస్తుంది. 

అయినప్పటికీ ఇంకా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. చాలామంది జలుబు దగ్గు జ్వరం వచ్చినప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకొని టెస్ట్ చేయించుకోవడం లేదు. ఇలా ప్రాథమిక లక్షణాలున్న వారిని కూడా గుర్తించేందుకు తెలంగాణ సర్కార్ ఒక కొత్త ఆలోచన చేసింది. 

మామూలుగా దగ్గు, జలుబు అని మెడికల్ షాపులకు వచ్చి మందులు కొనుక్కొని అందరూ వెళుతుంటారు. ఇలా కరోనా లక్షణాలతో గనుక ఎవరైనా వచ్చి మందులు కొనుక్కెళితే వారి కాంటాక్ట్ డీటెయిల్స్ సేకరించామని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా అందాయి. మెడికల్ షాప్ ఓనర్లతో ఇందుకు సంబంధించి చర్చలు కూడా జరపనున్నారు. 

ఇక మెడికల్ షాపులలో ఉండేవారు ఎవరైనా కరోనా లక్షణాలతో వస్తే వారి ఫోన్ నెంబర్ అడ్రస్ సేకరించి జీహెచ్ఎంసీ అధికారులకు అందిస్తారు. అప్పుడు అధికారులు వెళ్లి వారిని పరీక్షిస్తారు. 

ఇలా సాధ్యమైనన్ని ఎక్కువ పద్ధతులద్వారా సమాచారాన్ని సేకరించి కరోనా లక్షణాలున్న వారిని టెస్ట్ చేయాలనీ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య 800 దాటింది. ఇలాంటి సందర్భంలో ఇక సాధ్యమైనంత మందిని గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది. 

తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. హైదరాబాదులో కరోనా జలు విప్పుతోంది. తెలంగాణలో కొత్తగా 43 కేసులు నమోదు కాగా, అందులో హైదరాబాదులో నమోదైన కేసులే 31 ఉన్నాయి. దాంతో తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 809కి చేరుకుంది.  ఇప్పటి వరకు తెలంగాణలో 18 మంది మరణించారు. 

తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 605 ఉంది. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొంది 186 మంది డిశ్చార్జీ అయ్యారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాదులో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. హైదరాబాదులో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని కేసీఆర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ బయటకు రావద్దని ఆయన అన్నారు. 

ఆసిఫాబాద్ లో ఆరేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ నమోదైంది. ఇటీవల బాలుడి తాతకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దాంతో ఆసిఫాబాద్ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరుకుంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు గ్రామానికి చెందిన అతనికి కరోనా వైరస్ సోకింది.